18 July, 2026 | 4:47 PM

విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌

18-07-2026 04:47 PM

ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో హెడ్‌బాయ్‌, హెడ్‌గర్ల్‌ ఎన్నికలు

నిజమైన ఎన్నికల తరహాలో పోలింగ్‌, కౌంటింగ్‌పై అవగాహన

సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యతను పెంపొందించే లక్ష్యంతో శనివారం  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో హెడ్‌బాయ్‌, హెడ్‌గర్ల్‌ ఎన్నికలను నిజమైన ఎన్నికల మాదిరిగా నిర్వహించారు. ఓ వైపు పాఠశాల విద్యార్థి నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టగా, మరోవైపు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల తరహాలో పోలింగ్‌, ఓటింగ్‌, కౌంటింగ్‌ విధానాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడం విశేషంగా నిలిచింది.పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ పర్యవేక్షణలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.

ఎన్నికల నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు, రహస్య ఓటింగ్‌, బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటు వేయడం, అనంతరం ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను ఎన్నికల సంఘం నిర్వహించే విధానాన్ని అనుసరిస్తూ నిర్వహించారు.హెడ్‌బాయ్‌, హెడ్‌గర్ల్‌ పదవులకు మొత్తం 18 మంది విద్యార్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలనలో 3 నామినేషన్లుతిరస్కరించారు. అనంతరం ఇద్దరు అభ్యర్థులుఉపసంహరించుకోవడంతో, తుది పోటీలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. వారికి ప్రత్యేక ఎన్నికల గుర్తులు కేటాయించి బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఓటింగ్‌ నిర్వహించారు.

పాఠశాల విద్యార్థులందరూ ఉత్సాహంగా ఓటు హక్కునువినియోగించుకుని ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల నిర్వహణ, ఓటు విలువపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరమన్నారు. భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత భావన, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువల పట్ల గౌరవం పెంపొందుతుందని పేర్కొన్నారు.పాఠశాల ఉపాధ్యాయులు ఎన్నికల అధికారులుగా వ్యవహరించి మొత్తం ప్రక్రియను విజయవంతంగా నిర్వహించగా, ఈ వినూత్న కార్యక్రమాన్ని తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభినందించారు.విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై ఆచరణాత్మక అవగాహన కల్పించిన ఈ మాక్‌ పోలింగ్‌ కార్యక్రమంఆదర్శప్రాయంగా నిలిచింది. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.