ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడులకు స్వర్గధామం
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
రంగారెడ్డి, మే 22(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పటంలోనే కాకుండా ప్రపంచ పటంలో ’ఫ్యూచర్ సిటీ’ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తుందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం‘ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి ప్రజలతో కలిసి బీపీ చెక్ చేయించుకుని, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
రెండేళ్లలో రంగారెడ్డి జిల్లా ప్రగతి ప్రస్థానం ను వివరించారు.సీఎం ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయని మహేందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో రైతు భరోసా పథకం కింద రూ.2.97 లక్షల మంది రైతులకు రూ. 722 కోట్ల రైతు భరోసా, అలాగే 735 రైతు కుటుంబాలకు రూ. 367 కోట్ల రైతు బీమా సాయం అందించారమని ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద పట్టణ ప్రాంతాలు మినహాయించి జిల్లాకు 16,050 ఇండ్లు మంజూరయ్యాయని దీనికోసం రూ. 22 కోట్ల నిధులు విడుదలయ్యాయని,రేషన్ కార్డులు & పింఛన్లు కోసం కొత్తగా 1.06 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసి 3.52 లక్షల మందికి లబ్ధి చేకూర్చారు.
1.91 లక్షల మందికి ఆసరా పింఛన్లు, 2.93 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. జిల్లాలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ. 977 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించిందని తెలిపారు.
పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలు..
జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా 99 రోజుల ప్రణాళిక విజయాలను వివరించారు. అర్హులకు లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరా మహిళా శక్తి ద్వారా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల జారీ ఉంటుందని, సన్న బియ్యం పంపిణీతో పాటు సన్న రకం వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఇందిరా మహిళా శక్తి సంఘాలకు బ్యాంక్ రుణాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ట్రాన్స్జెండర్లకు ఆర్థిక సహాయం చెక్కులను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో టీయఫ్‌ఐ డీసీ ఛైర్మన్ చల్లా నరసింహారెడ్డి, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, వీర్లపల్లి శంకర్,మల్ రెడ్డి రంగారెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు, అదనపు కలెక్టర్లు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.






