అక్రమంగా షెడ్ల నిర్మాణం
ఘట్ కేసర్, మే 22 : ఘట్ కేసర్ సర్కిల్ పరిధి పోచారం డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా షెడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అక్రమ షెడ్ల నిర్మాణాలపై స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జీహెచ్‌ఎంసీ అధికారులను కలిసి మాట్లాడుకొని కొందరు చాటు మాటున షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. మరి కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు ఈషెడ్ల నిర్మాణం చేపట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. తాజాగా పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ నారాయణ కళాశాల సమీపంలో అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డుపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ షెడ్ల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






