భావి ప్రధాని రాహుల్ గాంధీ
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఘనంగా కాంగ్రెస్ అగ్రనేత జన్మదిన వేడుకలు
ఆమనగల్లు, జూన్ 19 (విజయక్రాంతి): భారత రాజకీయ యవనికపై అన్ని వర్గాల ఆశాకిరణం, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భవిష్యత్తులో దేశాన్ని ఏలే నేత అని, త్వరలోనే ఆయన దేశ ప్రధాని కాబోతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కల్వకుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కేక్ కట్ చేసి, కార్యకర్తలకు, నాయకులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో యువత, విద్యావంతులు, రైతులు, కార్మికులతో సహా అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో రాహుల్ గాంధీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన, చూపిస్తున్న సేవాస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం నుండి అశేష సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల 'జై రాహుల్.. జై కాంగ్రెస్' నినాదాలతో ఎమ్మెల్యే నివాసం మారుమోగింది.
ఈ సంబరాలు కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని, ఐక్యతను నింపాయని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ నేత బాలాజీ సింగ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,సర్పంచులు పాలకూరల కర్ణాకర్ గౌడ్ మహేందర్ గౌడ్, నరేందర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ యాదయ్య,నాయకులు కేశవులు, నిట్ట నారాయణ, శ్రీనివాస్ రెడ్డి,నరసింహ,మాజీ ఎంపీపీ సాంబయ్య గౌడ్, సుమన్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






