విద్యుత్ పోరాట అమరవీరుల స్పూర్తితో భవిష్యత్ పోరాటాలు
నాటి పోరాట ఫలితమే ప్రజలకు విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గింపు
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
కొత్తగూడెం టౌన్ ఆగస్టు 28 (విజయక్రాంతి): విద్యుత్ పోరాట అమరవీరుల స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. విద్యుత్ పోరాట అమరవీరుల వర్ధంతి కార్యక్రమం శుక్రవారం స్తానిక మంచికంటి భవన్లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడంలో భాగంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాడని తెలిపారు.చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలను నిరసిస్తూ ఆందోళన పోరాటాలు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగాయన్నారు.
ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తూ వేలాదిమంది ప్రజలతో హైదరాబాద్ చేరుకోగా కర్కశ చంద్రబాబు ప్రభుత్వం లాఠీచార్జీ చేయడంతోపాటు,శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామిలు మరణించారన్నారు. అమరవీరుల పోరాట ఫలితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెనక్కు తగ్గిందని నాటినుండి నేటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సాహసం చేయలేదన్నారు.ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నూతన విద్యుత్ సంస్కరణల చట్టం తీసుకొచ్చి,స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు మోపడానికి సిద్ధమవుతుందని ఈ కుట్రలను విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.






