స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో రక్షాబంధన్
వెల్లివిరిసిన ఆత్మీయ సోదర,సోదరీమణుల ప్రేమ
ఖమ్మం ఆగస్టు 28(విజయక్రాంతి): సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలిచిన రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఆనందోత్సవాలతో నిర్వహించారు. ప్రతి తరగతిలో పాఠశాల విద్యార్థులకు బాలికలు రక్షణ కట్టి తమ అనుబంధాన్ని చాటారు. బాలుర ముంజేతికి రక్షాబంధన్ కట్టి, బాలికలు వారికి మిఠాయిలు తినిపించి ఆప్యాయతను చాటారు. విద్యార్థులందరిలో సోదర ప్రేమ వెల్లి విరిసింది. రాఖీలు కడుతున్నంతసేపు బాలుర ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది.
అదేవిధంగా పాఠశాల పరిసర ప్రాంతాలలోని చెట్లకు విద్యార్థులు రాఖీలు కట్టి తమ వృక్ష బంధాన్ని తెలియజేశారు. దీనితో పాటు పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలకు, వాచ్మెన్, డ్రైవర్స్, తమ ఫోటోలు ఎల్లప్పుడూ తీస్తున్న ఫోటోగ్రాఫర్స్ కు పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ “విద్యార్థులలో సహోదర ప్రేమ విలువను తెలియజేసేందుకు రక్షాబంధన్ వేడుకలను పాఠశాలలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం… జీవితాంతం నిలిచే ఒక మధురమైన బంధం.. చేతికి కట్టే రాఖీ ఒక దారం మాత్రమే కాదు… ప్రేమకు, నమ్మకానికి, ఆప్యాయతకు ప్రతీక*అని, పురాణాల కాలం నుండి ప్రత్యేకంగా మన దేశంలోని అన్ని ప్రాంతాలలో రక్షాబంధన్ వేడుకలకు మహోన్నత స్థానం ఉందని పేర్కొన్నారు.
తోడబుట్టిన సోదరులకే కాకుండా ఇతరులను సోదరులుగా భావించి రాఖీలు కట్టే సంప్రదాయం మనదేశానికే సొంతం అని తెలియజేశారు. రాఖీ పర్వదినం ప్రజలందరిలో అనురాగ ఆప్యాయతలను, ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.” ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.






