20-08-2025 02:14:48 PM
న్యూఢిల్లీ: భారతదేశంలోని ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమ సంస్థలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు(Union Home Minister Amit Shah) లేఖ రాశాయి. నైపుణ్యం ఆధారంగా రూపొందించబడిన అన్ని రియల్-మనీ గేమ్‌లను నిషేధించాలని ప్రతిపాదించే ముసాయిదా బిల్లుపై జోక్యం చేసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశాయి. నిషేధం వల్ల ఉద్యోగాలను పోతాయని, కోట్లాది మంది వినియోగదారులను చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ బెట్టింగ్, జూదం ప్లాట్‌ఫారమ్‌ల వైపు మెగ్గుచూపుతారని ఒక ఉమ్మడి లేఖలో హెచ్చరించాయి. ఆగస్టు 19 నాటి ఈ లేఖను ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (All India Gaming Federation), ఈ-గేమింగ్ ఫెడరేషన్ (EGF) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS) తరపున పంపారు.
ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ ఒక సూర్యోదయ రంగం అని, దీని ఎంటర్‌ప్రైజ్ వాల్యుయేషన్ రూ.2 లక్షల కోట్లకు పైగా ఉందని, వార్షిక ఆదాయం రూ.31,000 కోట్లకు పైగా ఉందని పేర్కొంది. ఈ రంగం ప్రత్యక్ష, పరోక్ష పన్నులలో ఏటా రూ.20,000 కోట్లకు పైగా వాటాను అందిస్తుంది. 2028 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉన్న 20శాతం సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు (Compound annual growth rate)తో వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. 2020లో 36 కోట్ల మంది భారతీయ ఆన్‌లైన్ గేమర్‌ల సంఖ్య 2024 నాటికి 50 కోట్లకు పైగా పెరిగింది. జూన్ 2022 నాటికి ఈ పరిశ్రమ రూ.25,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (Foreign Direct Investment) ఆకర్షించిందని, ప్రస్తుతం రెండు లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తుందని కూడా లేఖలో పేర్కొన్నారు.
ఈ నిషేధం ప్రపంచ పెట్టుబడులను నిరుత్సాహపరుస్తుందని, పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీస్తుందని, 400కి పైగా కంపెనీలను మూసివేస్తుందని, డిజిటల్ ఆవిష్కర్తగా భారతదేశం స్థానాన్ని బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. ప్రజలను రక్షించడానికి బదులుగా, బిల్లు వారిని "మోసం, దోపిడీ, అసురక్షిత పద్ధతులకు" గురిచేసే ప్రమాదం ఉందని, చివరికి అక్రమ ఆఫ్‌షోర్ ఆపరేటర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని లేఖ హెచ్చరించింది. "మా రంగం కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, సృజనాత్మకత, వ్యవస్థాపకత కూడలిలో స్వదేశీ, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పరిశ్రమ సృష్టిని సూచిస్తుంది. నేడు, వేలాది స్టార్టప్‌లు, యువ ఇంజనీర్లు, కంటెంట్ సృష్టికర్తలు ఈ పర్యావరణ వ్యవస్థపై ఆధారపడుతున్నారు.
ఈ బిల్లు వల్ల లబ్ధి పొందేది అక్రమ ఆఫ్‌షోర్ జూదం నిర్వాహకులు మాత్రమే. చట్టబద్ధమైన భారతీయ వ్యాపారాలు మూసివేయబడితే, నియంత్రణ లేని వ్యక్తులు ఆ శూన్యతను భర్తీ చేస్తారు. ఇది రాష్ట్ర, జాతీయ పన్ను ఆదాయాలను క్షీణింపజేస్తుంది. భారతీయ వినియోగదారులను నియంత్రించని ప్లాట్‌ఫామ్‌లకు గురి చేస్తుంది'' గేమింగ్ ఫెడరేషన్ కేంద్రానికి సూచించింది. నిషేధం కాదు, ప్రగతిశీల నియంత్రణ కోసం పిలుపునిస్తూ, వినియోగదారులు, పరిశ్రమ రెండింటినీ రక్షించే బాధ్యతాయుతమైన గేమింగ్ ఫ్రేమ్‌వర్క్‌లను చర్చించడానికి, వారి వాదనను ప్రదర్శించడానికి హోం మంత్రితో సమావేశం కావాలని సంస్థలు అభ్యర్థించాయి. ఈ లేఖపై ఏఐజీఎఫ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోలాండ్ లాండర్స్, ఎఫ్ఐఎఫ్ఎస్ డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య, ఈజీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనురాగ్ సక్సేనా సంతకం చేశారు.