20-08-2025 04:10:17 PM
హైదరాబాద్: రెండు నెలలుగా తెలంగాణలో దయానీయమైన పరిస్థితి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మీడియా సమావేశం ద్వారా పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఎరువుల బస్తాల కోసం రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేసీఆర్ పాలనలో యూరియాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని తెలిపారు. వ్యవపాయంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎలాంటి సమీక్ష చేయలేదని, ముందస్తు ప్రణాళిక లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నరని, వ్యవసాయ శాఖకు ఇతర శాఖలతో సమన్వయం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఓ రైతు 3 బస్తాల యూరియా తీసుకుంటే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో యూరియా కోరతే లేదని, బ్లాక్ మార్కెట్ లో కాంగ్రెస్ నేతలే యూరియా అమ్ముతున్నారని కేటీఆర్ తెలిపారు. దిల్లీకి 51 సార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఒక్క బస్తా కూడా తీసుకురాలేకపోయారని.. ఎరువుల కోరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ ఎందుకు ప్రశ్నిస్తాలేరని విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తాం.. దిల్లీకి డబ్బులు సంచులు తీసుకెళ్లే దృష్టి.. రైతులపై లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఏపీ మంత్రులు దిల్లీకి వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారని.. కాంగ్రెస్, బీజేపీ రైతులను మోసం చేస్తున్నాయన్నారు. రామగుండం యూనిట్ ను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తెలిపారు.