ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ దొంగల ముఠా అరెస్ట్
- రూ.3.57 లక్షల విలువైన కాపర్ వైరు స్వాధీనం
- విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడి
టేకులపల్లి,(విజయక్రాంతి): మండలంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను(Agricultural transformers) ధ్వంసం చేసి కాపర్ వైరు దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టేకులపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టేకులపల్లి లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకన్న బాబు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు(SP Rohit Raju) ఆదేశాల మేరకు సూచనలతో సీఐ బి. సత్యనారాయణ పర్యవేక్షణలో ఎస్‌ఐ తిరుపతి సిబ్బందితో కలిసి టేకులపల్లి సమ్మక్క–సారక్క గద్దెల వద్ద వాహన తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఈ క్రమంలో కొత్తగూడెం వైపు నుంచి టేకులపల్లి వైపు వస్తున్న ఆటో పోలీసులను చూసి వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుకుని విచారించారు.
ఆటోలో ఉన్న పల్లపు వెంకటేష్ (35), రౌతు రమేష్ (34), వేముల సంతోష్ (34)లను విచారించగా నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముత్యాలంపాడు, కోయగూడెం, శాంతినగర్, సులానగర్, 9 మైల్ తండా, కోక్యా తండా, బోడు ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైరు చోరీ చేసినట్లు వెల్లడించారు. అలాగే కొత్తగూడెంలోని సింగరేణి స్థలంలోనూ కాపర్ వైరు దొంగిలించినట్లు తెలిపారు.
దొంగిలించిన సుమారు 178.5 కిలోల కాపర్ వైరు, విలువ రూ.3.57 లక్షలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీటిని సంతోష్ ఆటోలో తరలించి పాల్వంచలోని సాయిరాం స్క్రాప్‌షాప్‌తో పాటు తెలకపల్లి బాబుకు విక్రయించినట్లు నిందితులు వెల్లడించినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న లోతువాగుకు చెందిన తెలకపల్లి బాబు, పాల్వంచకు చెందిన సాయిరాం కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐ కొగిల తిరుపతి, ఏఎస్‌ఐ బి. నరసింహారావు, సిబ్బందిని డీఎస్పీ యు. వెంకన్నబాబు అభినందించారు.