లక్డీకాపూల్‌లో ‘గంజాయి’ గుట్టురట్టు
ఇద్దరు మహిళల అరెస్ట్ ః 21.251 కిలోల గంజాయి స్వాధీనం
ఖైరతాబాద్, మే 30 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సైఫాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.ఈ క్రమంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.సైఫాబాద్ సీఐ సీతయ్య శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ ఎం. స్వామి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పార్కింగ్ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో లగేజీ బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా,వారి బ్యాగుల్లో చాకచక్యంగా దాచిన 19 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి.
పోలీసుల విచారణలో నిందితులు విశాఖపట్నానికి చెందిన శ్రీను అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి ముంబైకి తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో మొత్తం 21.251 కిలోల గంజాయితో పాటు రెండు లగేజీ బ్యాగులు,మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు చేసిన నిందితులను తిప్పిగిరి లక్ష్మి (43), సందీప్ కౌర్ సింగ్ (60)గా గుర్తించిన పోలీసులు,వారిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు వెల్లడించారు.
కేసులో బేబీ, సంపత్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.సైఫాబాద్ ఏసీపీ ఆర్. సంజయ్ కుమార్ పర్యవేక్షణలో డీఐ రాజేందర్, ఎస్‌ఐ స్వామి, కానిస్టేబుళ్లు వాణి, లింగస్వామి, దుర్గాభవాని తదితరులు ఈ ఆపరేషన్లో పాల్గొని నిందితుల అరెస్టులో కీలక పాత్ర పోషించినట్లు సీఐ సీతయ్య తెలిపారు.






