10 August, 2026 | 2:53 AM

తెలంగాణ- సరిహద్దులో గంజాయి కలకలం!

10-08-2026 01:47 AM

సుల్తానాపురంలో 1.30 కిలోల గంజాయి స్వాధీనం

పల్లెలకూ విస్తరిస్తున్న మత్తు సంస్కృతిపై ఆందోళన

అలంపూర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ విక్రయాలపై పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలంపూర్ మండలం సుల్తానాపురం గ్రామంలో గంజాయి విక్రయాలపై అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు 1.30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 పల్లెలకూ పాకుతున్న మత్తు సంస్కృతి 

ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన మత్తు పదార్థాల వినియోగం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపిస్తుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సరఫరా మూలాలపై నిఘా అవసరం

సరిహద్దు ప్రాంతం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అవకాశం లేకుండా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం విక్రయదారులను పట్టుకోవడమే కాకుండా సరఫరా మూలాలను గుర్తించి, గంజాయి రవాణా, విక్రయాల వెనుక ఉన్న నెట్వర్క్పై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గంజాయి దందాను ఆదిలోనే అడ్డుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.