రాహుల్.. హైదరాబాద్ ఎప్పుడొస్తరు?
- చ్ఛాత్రోం కీ గూంజ్‌ను అశోక్‌నగర్‌లోనే నిర్వహించాలి
- విద్యార్థులు, యూత్ గోడు విని.. వారిని ఎదుర్కోవాలి
- యూత్ లీడర్‌వైతే వారి సమస్యలు పరిష్కరించాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- అశోక్‌నగర్‌లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నలు
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): విద్యార్థులు, యువత సమస్య లపై రాహుల్‌గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ‘చ్ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమా న్ని హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిర్వహించాలని, తెలంగాణ యువత, విద్యార్థుల ఆవేదన విని, వారిని ఎదుర్కొవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశమంతటా తిరుగుతూ, ముఖ్యంగా ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘చ్ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యూత్‌కు తానే పెద్దదిక్కులా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ 56 ఏళ్ల యూత్ లీడర్ తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో నలిగిపోతున్న విద్యార్థుల బాధలను ఎప్పుడు ఆలకిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఫీజు చెల్లించలేదని విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కళాశాలల యాజమాన్యాలు ఇవ్వడం లేదని, దీంతో వేలాది మంది విద్యార్థులు పై చదువులకు వెళ్లలేక, ఉద్యోగాల్లో చేరలేక నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ఈ విషయం రాహుల్‌గాంధీకి తెలియదా? లేక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యార్థుల సమస్యలు ఆయనకు పట్టవా? అని ప్రస్తావించారు. 2020 నుంచి దాదాపు రూ.12వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనిపై హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించిందని గుర్తు చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలిచ్చారని, రెండున్నర ఏళ్లు గడిచినా అందులో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఎంతో మంది పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని, రాష్ట్రానికి వచ్చి వారి సమస్యలను స్వయంగా వినాలని డిమాండ్ చేశారు.
ఆలయాల్లో రాంచందర్ రావు పూజలు..
హైదరాబాద్‌లోని తార్నాక, లాలపేట, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించిన బోనాల వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాలకు వెళ్లి దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.






