ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం
- క్వింట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటానికి సిద్ధంకండి
- పార్టీ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపు
- గాంధీభవన్‌లో ఘనంగా క్విట్ ఇండియా దినోత్సవం
- మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ హాజరు
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్య పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కంకణబద్ధులు కావాలని, క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. టీపీసీసీ సేవాదళ్ చైర్మన్ మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీభవన్‌లో క్విట్ ఇండియా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్‌కు మార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పీసీసీ చీఫ్‌తో పాటు మంత్రు లు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ఎంపీ అనిల్ యాదవ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తదితరులు స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ ఇచ్చి న డూ ఆర్ డై పిలుపు దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చారిత్రాత్మక మలుపుగా నిలిచిందన్నారు. అప్పడు దేశ స్వాతం త్య్రం కోసం పోరాటం చేస్తే..
గాంధీ ఇచ్చి న క్విట్ ఇండియా స్ఫూర్తితో ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ముందుకు సాగాలన్నారు. ఇదే స్వాతంత్య్ర సమరయోధులకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు. జెన్ జీ ఉద్యమ వీరులు క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకోవాలన్నారు. గాంధీ, నెహ్రూను మరిపించే ప్రయత్నం జరుగుతుందని, సర్దార్ పటేల్‌ను బీజేపీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోందని మహేష్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రంలో దేశం ఆశ్చర్యం పోయేలా అభివృధి, సంక్షేమం జరుగుతోందని, బీఆర్‌ఎస్ పదేళ్లలో ఉద్ధరించింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. సర్ ప్రక్రియలో ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతుందని, అడ్డుకొని అర్హత కలిగిన ఓటును కాపాడుతున్నామని చెప్పారు.
గాంధేయ మార్గంలో పాలన : మంత్రి శ్రీధర్‌బాబు
ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు, గాంధీయవాదులు చూపిన మార్గంలో కాంగ్రెస్ నాయకులు నడుస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గాంధీ స్పూర్తితో రాష్ట్రంలో శాంతియుతమైన పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రజావ్యతిరేక, మతతత్వ విధానాలు అవలంభిస్తున్న బీజేపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిరంతర పోరాటం సాగిస్తున్నారని పేర్కొన్నారు. శాంతిమార్గంలో ఏదైనా సాధించ వచ్చని మరోసారి జెన్ జీ ఉద్యమం ద్వారా నిరూపితమైందని మంత్రి పేర్కొన్నారు.
గాంధీ కళలు సాకారం కావాలంటే విద్యార్థులు తమ పోరాటాలను పటిష్టం చేయాలని సూచించారు. డూఆర్‌డై అనే నినాదంతో బ్రిటిష్ వారిపై గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ పోరాటంపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన గాంధీ ట్రస్ట్ నిర్వాహకులను మంత్రి అభినందించారు. అంతకుముందు గాంధీ పుస్తక ప్రదర్శన, గాంధీ విగ్రహాలను నాయకులు తిలకించారు.






