10 July, 2026 | 1:49 AM

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చెత్త లారీలు బంద్

10-07-2026 12:00 AM
  1. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి                
  2. యాంటీ డంపింగ్ యార్డ్ దమ్మాయిగూడ కార్యక్రమానికి సంఘీభావం                        
  3. ఈనెల 10 నుంచి 20 వరకు పాదయాత్రలు : చైర్మన్ షేక్షావలి                                

జవహర్‌నగర్, జూలై 9 (విజయక్రాంతి): జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చెత్త లారీల బంద్ కార్యక్రమం విజయవంతం చేయాలని చైర్మన్ షేక్షావలి పిలుపునిచ్చారు. ప్రభుత్వం డంపింగ్ యార్డ్ పట్ల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి  తదనంతరం డంపింగ్ యార్డ్ సమస్య పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 11వ తేదీన చెత్త లారీల బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి పేర్కొన్నారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని ప్రగతి నగర్ నీలం రామచంద్రయ్య భవన్లో చెత్త లారీల బందు భవిష్యత్ కార్యాచరణలో భాగంగా జులై 26వ తేదీన చేపట్టబోయే కార్యక్రమాలపై గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి, కో కన్వీనర్లు కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాంటీ డంపింగ్ యార్డ్ దమ్మాయిగూడ జేఏసీ నేతలు గత 11 సంవత్సరాలుగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డ్ తొలగింపుకై న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని, మే 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం యాంటీ డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారం కోసం హామీ ఇచ్చి రెండు నెలలు పూర్తయినా ఎలాంటి స్పందన లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి నిరసనగా ఈనెల 11వ తేదీన చెత్త లారీల బందుకు పిలుపులో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా స్పందించి చెత్త లారీల బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈనెల పది నుండి  నుండి శాంతినగర్ నుండి నోబెల్ స్కూల్ వరకు, 12వ తేదీన గబ్బిలాల పేట నుండి గిరి ప్రసాద్ నగర్ వరకు, 13వ తేదీన గాంధీనగర్ నుండి భాగ్యనగర్ కాలనీ వరకు, 14వ తేదీన ప్రగతి నగర్ నుండి బీజేఆర్ నగర్ వరకు, 15వ తేదీన నోబెల్ స్కూల్ నుండి అంబేద్కర్ నగర్ వాటర్ ట్యాంక్ వరకు, 16వ తేదీన కార్మిక నగర్, 17వ తేదీన మల్కారం, 18 వ తేదీన శివాజీ నగర్, 19వ తేదీన వికలాంగుల కాలనీ లెప్రసీ కాలనీ, 20వ తేదీన బాలాజీ నగర్ ఫైరింగ్ గడ్డ నుండి మెయిన్ బస్టాండ్ వరకు ప్రజా చైతన్య పాదయాత్రల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సలహాదారులు మాజీ ఉపసర్పంచ్ నరసింహ గౌడ్, తోటపల్లి శంకర్, అనురాధ, వి.ప్రవీణ్, పెరక సునీత, పి. శివబాబు, చంద్రమౌళి, బహుజన సత్త సింగరాయ గౌడ్, కమిటీ సభ్యులు సుర వెంకటేష్, స్వరూప, లక్ష్మీబాయి, జయసుధ, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.