10 July, 2026 | 1:52 AM

కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తా

10-07-2026 12:00 AM

బోర్డు మాజీ నామినేటెడ్ సభ్యుడు జన్యావుల రామకృష్ణ

సికింద్రాబాద్,జూలై 9 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన టీపీటీ ఛార్జీలను మరోసారి కోర్టు ద్వారా రాబట్టనున్నామని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జన్యావుల రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం మహేంద్రహిల్స్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనీ, గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కంటోన్మెంట్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు.

గతంలో కోర్టు ద్వారా దాదాపు రూ.100 కోట్లు వసూలు చేయగలిగామని, ఇప్పుడు కూడా టీపీటీ ఛార్జీల వసూళ్ల కోసం కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ విషయంపై కోర్టు సీరియస్ ఆర్డర్ జారీ చేసిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను కోర్టుకు హాజరుకావాలని, అలాగే ఈ కేసుకు సంబంధించిన తదుపరి వాయిదాలకు కూడా స్వయంగా హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం కీలక పరిణామమని రామకృష్ణ పేర్కొన్నారు.

ఈ కేసు అనంతరం కంటోన్మెంట్ బోర్డుకు సుమారు రూ.65 నుండి 75 కోట్లు రావచ్చని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాగే గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో రూ.300ల కోట్ల నిధులు కంటోన్మెంట్ బోర్డుకు రావడం గుర్తు చేశారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని జన్యావుల రామకృష్ణ తెలియజేశారు..