సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధం
సీఎం రేవంత్‌రెడ్డితో సింగపూర్ ప్రతినిధులు
గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి) : తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ(Semiconductor industry) ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్(Singapore) ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులను డిసెంబరులో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Telangana Global Summit)కు సీఎం ఆహ్వానించారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో సింగపూర్ ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్‌లీ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవం(Musi River Rejuvenation), ఫ్యూచర్స్ సిటీ అంశాలను వారికి సీఎం వివరించారు. తొలిదశలో మూసీ పునరుజ్జీవం చేపట్టనున్నట్లు తెలిపారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పటికే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని సింగపూర్ ప్రతినిధులకు సీఎం తెలిపారు.
భారత్ ఫ్యూచర్ సిటీని నెట్‌జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి ఆర్ధిక పరమైన సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్- జనరల్ విలియం చిక్, ఇతర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.