10 June, 2026 | 1:33 AM

నిరుద్యోగ సంక్షోభంపై జెన్ జీ పోరు

10-06-2026 12:00 AM

ప్రపంచంలో జనాభాపరంగానే కాకుండా, అత్యధిక యువత ఉన్న దేశం కూడా భారతదేశమే కావడం శుభపరిణామం. దేశంలో దాదాపు 40 కోట్ల మంది యవత ఉన్నట్లు, అందులో 35 సంవత్సరాలలోపు వారు అత్యధికంగా ఉన్న ట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. యువ త ఆలోచనలు, నిర్ణయాలపైనే వారి భవిష్యత్తుతోపాటు దేశ భవిష్యత్తు కూడా ఆధార పడి ఉంటుంది. అంతేకాదు, దేశంలోని జెన్ జీ, మిలీనియం యువత శక్తి సామర్థ్యాలను పాలకులు సద్వినియోగం చేసుకుంటేనే దేశంలో ఏ రకమైన అలజడులు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది వికసిత భారత్ కల సాకారం అవుతుంది.

లేకపోతే మరికొన్ని సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే భారత్ ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగం, అధిక ధరలు, అవినీతి, బంధుప్రీతి లాంటి సమస్యలు భవిష్యత్తులోనూ దేశాన్ని వెంటాడుతూనే ఉంటాయి. మరికొంత కాలం భారత్ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తుంది.

ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న ప్రధాని, కేంద్ర మంత్రులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు బూమర్ జనరేష న్‌కి చెందినవారే. దేశాభివృద్ధి ముఖ్యంగా పాలకుల విధానాలపైనే ఆధారపడి ఉం టుంది. అయితే పాలకుల విధానాలు శాశ్వతంగా అధికారంలో ఉండాలన్న దిశగానే ఎక్కువగా ఉంటున్నాయి. తమ పార్టీలు, కుటుంబీకులు, తమ అనుచరులు అధికారం చెలాయించడం కోసమే పాలన జరుగుతున్నది. ఈ విషయాన్ని నేటి యువ త పసిగడుతున్నది. ఈ నేపథ్యంలో ఇకనైనా యువత ఆకాంక్షలు నెరవేర్చే దిశగా పాలకులు అడుగులు వేయాలి.

ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు రచించాలి. కాగా, ఎంతో ఆర్భాటంగా దేశాన్ని నడిపిస్తున్న నేటి పాలకులు అసలు ఈ 12 సంవత్సరాల కాలంలో ఎంత మందికి ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వరంగాల్లో శాశ్వత ఉద్యోగాలు కల్పించారో తేటతెల్లం చేయాలి. అదే సంద ర్భంలో ఎన్ని ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించారు? ఎన్ని లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని నూతన కొలువులు సృష్టించారు? భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? అన్న విషయాలను యువతకు తెలియజేయాలి.

వివిధ శాఖల్లో ఖాళీల వివరాలను తెలపాలి. అంతేకాదు, వరుస పేపర్ లీకుల నేపథ్యంలో పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామకాలను నిబద్ధతతో, పారదర్శకతతో నిర్వ హించాలి. అక్రమాలు జరగకుండా చూసుకోవాలి. లేకపోతే దేశంలో నిస్పృహతో ఉన్న యువత, ముఖ్యంగా నిరుద్యోగుల నిరసనలతో పాలకులు దిగిపోయే పరిస్థితిని అతి త్వరలో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇప్పటి వరకు మన దేశ యువత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడం, నిరసనలు వ్యక్తం చేయడం లాంటివి చేస్తున్నారు. 

అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, యూరప్ దేశాల్లో జెన్ జీ, మిలీనియం యువత ఆయా దేశాల పాలకుల విధానాలు, అవినీతి బంధుప్రీతిపై పోరాటాలు చేస్తున్నారు. అనేక దేశాల్లో పాలకులను గద్దె దించి వారికి గుణపాఠం నేర్పించారు. మన దేశ యువత ఆలోచనలపై ఇవి ప్రభావం చూపుతున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం ద్వారా స్పష్టమైంది.

సామాజిక మాధ్యమాల ద్వారా మొన్నటివరకు నీట్ పేపర్ లీక్‌పై నిరసనలు వ్యక్తం చేసిన యువ త ఈనెల ఆరోవ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యక్ష నిరసన కార్యక్రమం చేపట్టారు. తద్వారా తాము క్షేత్రస్థాయిలోకి వచ్చి పాలకులను ప్రశ్నిస్తామని వారు చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇకనైనా పాలకుల తీరు మారాలి. ఇప్పటివరకు జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమను తాము సమర్థించుకోవటం సరికాదు.

ఎక్కడో అమెరికాలో ఉన్న ఓ ప్రవాస భారతీయ యువకుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరిట సామాజిక మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేశారు. కానీ, వాస్తవానికి మన దేశంలోని అవినీతి, బంధుప్రీతి, కుంభకోణాలు, మహిళలపై అఘాయిత్యాలు, విద్వేష రాజకీయాలు,  నిరుద్యోగం, అధిక ధర లు, ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ, విపరీతమైన ఉచిత పథకాలపై దేశ యువత ఎప్పు డో గొంతెత్తాల్సింది. కానీ, అలా జరగకపోవడం శోచనీయం. ఇకనైనా దేశంలో ఉన్న యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పాలకులను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవే ర్చాలని పాలకులను అడగాలి. అప్పుడే పాలకుల పనితీరు మెరుగుపడుతుంది.

ప్రజల ప్రయోజనాల కోసం, యువత ఆకాంక్షలు నెరవేర్చే దిశగా, ముఖ్యంగా విద్య, ఉపాధి, ఉద్యోగ అవసరాలు తీర్చే విధంగా పాలకులు పనిచేసేలా యువత ఉద్యమాలు చేపట్టాలి. దేశాభివృద్ధి, స్వయం సమృద్ధి సాధించేందుకు యువత నిర్మాతలుగా మారాలి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు, పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయ డం కోసం కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో యువత పరిశీలించాలి.

బూమర్ జనరేషన్ పాలకుల మాటల వలలో పడిపోకూడదు. కులం, మతం, భాషా, ప్రాంతం వంటి బలహీనతలకు అతీతంగా యువత నిలబడాలి.  రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా ఉండాలి. మరీ ముఖ్యంగా యువత ఇకనైనా రాజకీయ రంగప్రవేశం చేయాలి. అమెరికా వంటి దేశాల్లోనూ ప్రవాస భారతీయులు అనేక పదవుల్లో ఉన్నారు. కానీ, మన దేశ యవతలో రాజకీయ చైతన్యం తగినంతగా లేకపోవడం వల్ల నేటికీ బూమర్ జనరేషన్ పాలకులే చక్రం తిప్పుతున్నారు.

వారికి అనుకూలంగా విధానాలను రూపొందించుకొని, తరతరాలుగా అధికారం చెలాయి స్తున్నారు. అందువల్లనే దేశంలో యువత ఇప్పటికీ నిరుద్యోగులుగా నిస్పృహలో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా యువత చదువుతో పాటు పాలకుల విధానాలపై దృష్టిసారించాలి. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్న విషయా న్ని వారు గ్రహించాలి.

దేశ నిర్మాతలైన యువత సోషల్ మీడియాలో అనవసరంగా సమయాన్ని వృథా చేయకూడదు. వీడియో గేమ్స్, విపరీతమై న క్రికెట్ మోజును తగ్గించుకోవాలి. విలువైన సమయాన్ని ప్రణాళిక ప్రకారం సద్వి నియోగం చేసుకోవాలి. మద్యం, డ్రగ్స్ మత్తులో పడకూడదు. చైనా, వియత్నాం వంటి దేశాలు అభివృద్ధి పథంలో ముందుకుసాగుతూ ఉంటే, మనం మాత్రం నేటికీ అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నాం.

దీనికి గల కారణాలను ఇకనైనా విశ్లేషణ చేయాలి. అనేక అంతర్జాతీయ సూచీల్లో భారత్ వెనుకబడి ఉన్నట్లు పలు నివేదికలు చెబుతు న్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే విధంగా,  నైపుణ్యాలు సాధించే విధంగా పాలకులపై ఒత్తిడి తేవాలి. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి, ఒలింపిక్స్‌లో పతకాలు ఒడిసి పట్టాలి. తల్లిదండ్రుల ఆలోచనావిధానం కూడా మారాల్సిన అవసరం ఉంది. తమ పిల్లలకు ఎల్లప్పుడూ ఉత్తమ మార్కులు, గ్రేడ్‌ల కోసం, అత్యధిక ప్యాకేజీలు రావాలన్న ఆలోచన నుంచి బయటపడాలి. దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేలా పిల్లలను పెంచాలి. 

ఇక జెన్ జీ యువత తమ సమస్యలే కాకుండా, దేశంలో నెలకొన్న ఇతర సమస్యల పట్ల కూడా స్పందించాల్సిన అవ సరం ఉంది. రైతులు, విద్యార్థులు, శ్రామికులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కూడా పోరాటాలు చేయాలి. అదే సమయంలో తొలుత తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాసేవలో తరించే వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలి.  ఇప్పటికే దేశంలో ఉన్న పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు ధనికులు, వ్యాపారస్తులు, కార్పొరేట్లతో నిండిపోయాయి. ఇటువంటి పరిసితుల్లో పేద, మధ్యతరగతి, నిరుద్యోగుల కోసం ఆలోచన చేసే వారు అతి తక్కువగా ఉన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన తరుణమిది. తమ గమ్యాన్ని నిర్ధారించుకోవడంలోనే యువత భవిష్యత్తు, దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నాయని గ్రహించాలి.

వ్యాసకర్త: 6305682733 

ఐ.ప్రసాదరావు