బలం కాదు.. ఉపాయమే విజయం
సర్వత్రానుప్రణతః కులైడక ఇవ నిరాశో జీవితే వసతి
యుధ్యమానశ్చాల్పసైన్యః సముద్రమివ అప్లవః అవాగహమానః సీదతి
తద్ విశిష్టం తు రాజానమాశ్రితః దుర్గమ విషహ్యం వా చేష్టేత!
(కౌటిలీయం
అన్ని విధాలుగా శత్రువుకు వంగి ఉండేవాడు, మందలోనుంచి బెదిరి వచ్చిన గొర్రె వలె నిరాశానిస్పృహలతో నిస్సారమైన జీవితాన్ని గడపవలసి వస్తుంది. కొద్దిసైన్యంతో యుద్ధం చేసేవాడు తెప్పలేకుండా సముద్రంలోనికి దిగిన వాని వలె నశిస్తాడు. అందువ ల్ల బలహీనుడు ఎప్పుడైనా బలవంతుడైన రాజును గాని, అభేద్యమైన దుర్గాన్ని గాని ఆశ్రయించి, తాను చేయదలచిన పనిని సహనంతో అవకాశం కోసం వేచి ఉండి, ఉపాయంతో కార్యాన్ని నిర్వహించాలి, అంటాడు, ఆచార్య చాణక్య.
ఇక్కడ చాణక్యుడు శత్రువుతో పోరాడకూడదు అనడం లేదు, తగినంత బలం లేకుండా పోరాడడం ప్రమాదకరం అని మాత్రమే హెచ్చరిస్తున్నాడు. ఈ శ్లోకం ద్వారా మూడు ముఖ్యమైన అంశాల ను చెపుతున్నాడు, చాణక్య. శత్రువుకు పూర్తి గా వంగిపోతే మనోధైర్యం కోల్పోతారు. తగిన బలం లేకుండా యుద్ధం చేస్తే నాశనం అవుతారు.
కాబట్టి బలమైన మిత్రుడిని లేదా దుర్గాన్ని ఆశ్రయించి లక్ష్యాన్ని సాధించాలి. దీని వల్ల తెలిసే ప్రధానాంశం... శక్తి సమీకర ణ, ఆశ్రయ రాజకీయాలు. రామాయణంలో రాముడు ఒంటరిగా యుద్ధానికి వెళ్లలేదు. సుగ్రీవునితో స్నేహం చేశాడు. వానర సేనను సమకూర్చుకున్నాడు.మహాభారతంలో కౌరవపాండవులు ఇరుపక్షాలూ తమకు సహా యం చేసే రాజులను ఆశ్రయించి సైనిక సహకారాన్ని తీసుకోవడం శక్తి సమీకరణ, ఆశ్రయ రాజకీయాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
‘ఉపాయైరేవ జేతవ్యాః శత్రవః నతు యుద్ధతః యుద్ధేహి జయ సందేహః సదా భవతి దేహినా’.. శత్రువులను యుద్ధం ద్వారా కాదు, ఉపాయాల (తెలివి, వ్యూహం, దౌత్యం, యుక్తి) ద్వారా జయించాలి. యు ద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. విజయం ఎప్పుడూ సందేహాస్పదమే, అం టారు. ఉపాయమంటే మోసం చేయడం కాదు... దౌత్యం, మైత్రి, చర్చలు, గూఢచార వ్యవస్థ, సమాచార సేకరణ, ప్రత్యర్థి బలహీనతల విశ్లేషణ, సమయస్ఫూర్తి ఇలా పలు మార్గాల ద్వారా ప్రయత్నించి చివర అస్త్రం గా యుద్ధాన్ని ఆశ్రయించాలి.
ఈ శ్లోకంలో చాణక్యుడు శత్రువును నిరాశలోకి నెట్టండి, మానసిక యుద్ధం చేయండి అని సూటిగా చెప్పడం లేదు. కాకపోతే నిరాశకు లోనైన వ్యక్తి స్థితి ఎలా ఉంటుందో, బలం లేని యుద్ధ ఫలితం ఏమిటో, ఆశ్రయం లేకపోతే ఏమవుతుందో వివరిస్తున్నాడు.
మహాభారత యుద్ధ సమయంలో ధర్మరాజు ఎవరైనా తమ వైపున యుద్ధం చేయా లంటే వారిని తన తమ్ముల విధంగా ఆదరిస్తానని ప్రకటించడం, దానికి స్పందించిన యుయుత్సుతుడు పాండవ పక్షంలో చేర డం కనిపిస్తుంది. కృష్ణుడు శాంతి కోసం ప్రయత్నించాడు. స్వయంగా రాయబారం నెరిపాడు. అది పొసగని వేళ శత్రువుల బలహీనతలను గుర్తించి వాటిని ఉపయోగించుకునే ఉపాయాలను ఆలోచించాడు. అలాగే కౌరవుల నుంచి కర్ణుని వేరుచేసే ప్రయత్న మూ చేశాడు. కర్ణుని వద్ద వరాలు కోరేందుకు కుంతిని ప్రోత్సహించాడు. వ్యూహం, దౌత్యం, రాజకీయ చాతుర్యం, సమయస్ఫూర్తి విజయ సాధనలో కీలక పాత్రను పోషిస్తాయి.
పాండవులు భీష్మద్రోణులను బలంతో జయించలేదు, ఉపాయంతో వారి మరణ రహస్యాన్ని తెలుసుకొని వధించారు. జరాసంధుని సైనిక బలంతో ఎదిరించలేదు. కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణుల వేషంలో జరాసంధుని వద్దకు వెళ్లి యుద్ధభిక్షను కోరారు. తదుపరి జరాసంధుడుని ఎలా చంపాలో భీమునికి కృష్ణుడు సూచించాడు. విజయసాధనలో ఉపాయం అవసర మే కానీ, ధర్మానికి విరుద్ధమైన ఉపాయాల వల్ల నైతికంగా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉన్నది. చాణక్యుని దృష్టిలో విజయసాధన, రాజ్యరక్షణ ప్రముఖమైనవి కాగా మహాభారతం ధార్మిక విజయానికి ప్రాముఖ్యాన్ని స్తుంది.
చాణక్యుడు ఈ శ్లోకంలో మానసిక యు ద్ధాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. అయినా నిరాశ, మనోబలహీనత వల్ల కలిగే పరిణామాలను వివరించిన తీరు ఆధునిక యుద్ధా లలో కనిపించే మానసిక వ్యూహాలను గుర్తు కు తెస్తుంది. ఈనాడు కూడా యుద్ధాలలో శత్రువు ఆయుధాలను, భూభాగాన్ని నాశ నం చేయడంపై కాక వారి భావోద్వేగాలను, ఉద్దేశాలను, తార్కిక ఆలోచనలను, ప్రవర్తనలను ప్రభావితం చేస్తూ, మానసికంగా బల హీనులను చేయడంపై, ప్రణాళికాబద్ధంగా వ్యూహాలను రచిస్తున్నారు.
ఈ ఉపాయాలను, వ్యూహాలను మనిషి మనస్సును లక్ష్యంగా చేసుకున్న ఆయుధాలుగా చెప్పుకోవచ్చు. దీనితో యుద్ధభూమిలో అడుగు పెట్టకముందే శత్రువు పోరాట పటిమను, సంకల్పాన్ని దెబ్బతీయడం, పోరాడాల్సిన సైనికులలో ‘మనం గెలవలేం, మన నాయకత్వం విఫలమైంది, పోరాడి ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం లేదు’ అనే భావనలోకి వెళ్లేట్లుగా చేయడమే వీటి ప్రధాన ఉద్దేశం.
‘మీ పక్షం బలహీనమైంది.. మాకు లొంగిపోండి. మీ పట్ల మానవీయంగా వ్యవహరి స్తాం, మిమ్మల్ని సగౌరవంగా మీ కుటుంబాల వద్దకు పంపిస్తాం’ అంటూ బాధ్యత గలిగిన అధికారి పేరుతో ప్రకటించడం. వివిధ మాధ్యమాల ద్వారా శత్రు దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజలను, సైనికులను అయోమయానికి గురిచేయడం. శత్రు దేశాధ్యక్షుడు లేదా సైనికాధికారి మాట్లాడినట్లుగా నకిలీ వీడియోలు, ఆడియోలను రూపొందించి.. సైనికులను ఆయుధాలు వదిలి వెళ్లేందుకు ఆదేశాలు ఇచ్చినట్లుగా చేయడం.
శత్రుదేశంలో అంతర్గతంగా జాతి, మత, ప్రాంత, రాజకీయ విభే దాలను రెచ్చగొట్టి అశాంతిని సృష్టించడం.. సైబర్ నేరాలను ప్రోత్సహించి ప్రజలను నిజానికి, నకిలీకి తేడా తెలియని భ్రమలకు గురిచేయడం యుద్ధ తంత్రాలుగా చెలామ ణి కావడం చూస్తున్నాం. వీటి లక్ష్యం శత్రువు మనోబలాన్ని దెబ్బతీయడం, శత్రువును నిరాశ, భయం, సందిగ్ధత వైపు నెట్టివేయ డం, చివరగా పోరాట పటిమను, విజయసాధన సంకల్పాన్ని కోల్పోయేలా చేయడం.
ఈ శ్లోకం పాలకులకు మాత్రమే పరిమితం కాదు, వ్యక్తిగత జీవితానికీ వర్తిస్తుంది. చాణక్య ఎక్కడా శత్రువును అలా చేయండి అని చెప్పకుండానే అలా అయితే ఏమవుతుందనే పరిణామాన్ని వివరిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. సన్నద్ధత లేకుండా పెద్ద సవాళ్లలోకి దిగవద్దు. అవసరమైనప్పుడు మిత్రులు, గురువులు, ఇతర సంస్థలు వంటి బలమైన ఆధారాలను ఆశ్రయించాలని హెచ్చరిస్తున్నాడు. నిజానికి సరైన సమయం కోసం వేచి ఉండడం కూడా ఒక వ్యూహమే. విజయం కేవలం బలంతో కాదు, ఉపాయంతోనూ వస్తుంది.
అందువల్ల ఈ శ్లోకం బలహీనతను అంగీకరించమని కాదు, బలహీనతను అధిగమిం చే వరకు సహనంతో శక్తిని సమీకరించమని బోధిస్తుంది. విజయాన్ని సాధించేందుకు ధైర్యసాహసాలు అవసరమే కానీ అవి మాత్రమే సరిపోదు. వాటికి తోడుగా శక్తి సామర్థ్యాలు, మిత్రుల సహకారం, ఉపాయాలు, వ్యూహాలు, సమయోచిత నిర్ణ యాలు కూడా అవసరమని చాణక్య అన్యాపదేశంగా చెబుతున్నాడు.
పాలకుర్తి రామమూర్తి






