11 June, 2026 | 1:17 AM

ఈహెచ్‌ఎస్ అమలయ్యేదెన్నడో?

11-06-2026 12:00 AM

మానేటి ప్రతాపరెడ్డి :

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం రేవంత్‌రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) ఒక ప్రహసనంగా మారింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు తయారైంది పరిస్థితి. జూన్ 2 నుంచే హెల్త్ కార్డులపై కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని నమ్మబలికిన అధికారులు ఆచరణలో మాత్రం ఇప్పటి వరకు చేసింది శూన్యం.

ముఖ్యమంత్రి ఆదేశాల పేరుతో ఉద్యోగులు, పెన్షనర్ల మే నెల వేతనాల నుంచి 1.5 శాతం మొత్తాన్ని ముందస్తుగా, అది కూడా డీడీవోలతో నిమిత్తం లేకుండా నేరుగా కట్ చేసేశారు. కానీ, జీతాల కోత జరిగిన వేగంలో ఒక్క శాతం కూడా వైద్య సేవలు అందించడంలో చూపకపోవడం ఉద్యోగ వర్గాలకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. సేవలు మొదలయ్యాకే కోతలు అనే కనీస ధర్మాన్ని విస్మరించి, జీతాలకు కోతలు విధించడం శోచనీయం.

ఉద్యోగుల జీతాల నుంచి పైసలు కట్ చేసుకోవడంలో చూపించిన ఉత్సాహం, డిజిటల్ హెల్త్ కార్డుల జారీలో చూపించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి తార్కాణం. పాత కార్డులు చెల్లవని కార్పొరేట్ ఆసుపత్రులు ముఖం మీదే చెప్తున్నాయి. డిజిటల్ కార్డులు ఎప్పుడు వస్తాయో ఉన్నతాధికారులకే స్పష్టత లేదు.

ఈ గందరగోళం మధ్యలో నలిగిపోతున్నది మాత్రం సామాన్య ఉద్యోగ, ఉపాధ్యాయులు, వృద్ధులైన పెన్షనర్లే. మరోవైపు కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పెదవి విరుస్తూ ‘మా అంగీకారం లేకుండా, మాతో కనీస సంప్రదింపులు జరపకుండా, పాత బకాయిలు తీర్చకుండా.. ఏకపక్షంగా ఈహెచ్‌ఎస్ వైద్యం చేయమంటే ఎలా చేస్తాం? సరైన విధివిధానాలు ఖరారు చేయకుండా వైద్యాన్ని ఉచితంగా అందించడం మావల్ల కాద’ని తెగేసి చెప్తున్నాయి.

నగదు రహిత వైద్యం అంటూ ఆర్భాటం చేసిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో జరుగుతున్న దారుణాలను గుడ్డిగా విస్మరిస్తోంది. హెల్త్ కార్డులను నమ్ముకుని ఆసుపత్రుల్లో చేరిన ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి యాజమాన్యాలు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. అత్యవసర కేసు అయినా సరే, ముందుగా అడ్వాన్స్ కడితేనే చికిత్స చేస్తున్నారు. లేదంటే ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు. ఈహెచ్‌ఎస్ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు.

జీతాల రికవరీ కోసం అర్ధరాత్రి జీవోలు ఇచ్చే అధికార యంత్రాంగం, ఆసుపత్రుల్లో ఉద్యోగుల జేబులు గుల్లవుతుంటే ఎందుకు మౌనంగా ఉంది? చందా వసూలులో ఉన్న వేగం.. ప్రాణాలు కాపాడే సేవలో ఎందుకు లేదో అధికారులు సమాధానం చెప్పాలి. ఇది కేవలం ఒక సాధారణ పరిపాలనా లోపమో, అధికారుల అలసత్వమో కాదు, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలతో చెలగాటమాడటమే. 

జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి ఉచిత వైద్యం అందుతుందని ఆశపడ్డ ఉద్యోగ లోకానికి నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈహెచ్‌ఎస్ సంక్షోభంపై సత్వరమే ప్రత్యేక దృష్టిసారించాలి. క్షేత్రస్థాయిలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత కార్డుల ద్వారానే కార్పొరేట్ ఆసుపత్రుల్లో నూటికి నూరు శాతం నగదు రహిత వైద్యం అందేలా ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులివ్వాలి.

హెల్త్ కార్డులు ఉన్నా చేర్చుకోని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జూన్ 2 తర్వాత హెల్త్ కార్డులు పని చేయక, నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చేరి అప్పులు తెచ్చి సొంతంగా డబ్బులు చెల్లించిన ఉద్యోగులు, పెన్షనర్లందరికీ వారు ఖర్చు చేసిన ప్రతి పైసాను ప్రభుత్వం ఎలాంటి కోతలు లేకుండా వెంటనే రీయింబర్స్‌మెంట్ చేయాలి. లక్షలాది కుటుంబాల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈ సున్నితమైన సమస్యను ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించి పరిష్కరిస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 వ్యాసకర్త:టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, 

9848481028