9 August, 2026 | 2:43 AM

ఎన్నికలపై జెన్ జీ ప్రభావం!

09-08-2026 12:00 AM

దేశంలో ఒక దశాబ్దం పాటు తిరుగులేని పాలన చేసిన బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు వెలువడినా, ఎన్డీయే మిత్రపక్షా ల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికలలో ఎదురైన ఓటమితో జాగ్రత్త పడిన బీజేపీ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో, ముఖ్యంగా బంగాల్ ఎన్నికలలో విజయదుందుభి మోగించింది. ధనిక అగ్రవర్ణాలు, ఎగువ మధ్యతరగతి, యువత మద్దతుతో ఆ బీజేపీ దేశంలో ఒక బలమైన రాజకీయ పార్టీగా ఎదిగింది.

కానీ, ఇటీవల నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకి వ్యతిరేకంగా యువతరం (జెన్ జీ) గళం విప్పటంతో ఆ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగిందనే భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నది. పరీక్షల వ్యవస్థలో వైఫల్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఉద్యమ ప్రభావ ఫలితంగా ఇటీవల జరిగిన శాసనసభ ఉప ఎన్నికలలో బీజేపీ రెండు చోట్ల ఓడిపోవడం, ముఖ్యంగా అధికారంలో ఉన్న బీహార్‌లో ప్రతికూల ఫలితం రావటం భవిష్యత్తులో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అంశంగా కనబడుతున్నది.

ఉద్యమం చేసిన డ్యామేజ్

ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా, పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం అభిజిత్ దీప్కే నేతృత్వంలో కాక్రోచెస్, జెన్ జీ యువత చేసిన ఉద్యమం, ఆ ఉద్యమం పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, విద్యార్థి ఉద్యమాల వెనుక విదేశీ శక్తులు, సంఘవిద్రోహశక్తులు ఉన్నాయనే ప్రచారం, విద్యార్థి ఉద్యమకారులు టెర్రరిస్టులకు బీ టీం అనే వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి. విద్యార్థులు తమ ఉద్యమంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సహా ఇతర డిమాండ్లను కూడా నెరవేర్చుకోవటంతో దేశంలో వ్యవస్థ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.

జార్ఖండ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షలలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా దేవేంద్రనాథ్ మహతో నేతృత్వంలో విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో జెన్ -ఆల్ఫా యువత కూడా పాఠశాలలలో, కళాశాలలో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, ఫర్నిచర్ లాంటి మౌలిక సదుపాయాలు, టీచర్ల కొరతకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు భవిష్యత్తులో జెన్ జీ, జెన్- ఆల్ఫా ఉద్యమాలకు ప్రధాన ఎజెండాగా వారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉన్నతశ్రేణి అగ్రవర్ణాలు, ఎగువ మధ్యతరగతి వర్గాలు, యువతే బీజేపీ ప్రధాన బలం. అయితే దేశంలో యువత ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఉద్యమబాట పట్టిన తర్వాత జెన్ జీ యువతలో ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని తగ్గించి, వారిని తమ వైపునకు తిప్పుకోవడానికి ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ‘నన్ను, నా తల్లిని దూషించినా విద్యార్థులను క్షమిస్తున్నా’నని మోదీ తన ఔదార్యాన్ని ప్రదర్శిస్తే, ‘మీరు మమ్మల్ని క్షమించటం కాదు, వ్యవస్థ వైఫల్యాలకి బాధ్యత వహిస్తూ మీరే యువతకి క్షమాపణలు చెప్పాలి’ అని జెన్ జీ ప్రతిస్పందించింది.

ఈ నేపథ్యంలో యువతలో ప్రభుత్వంపై ఏర్పడిన అసంతృప్తిని తగ్గించడానికి, నష్ట నివారణకి స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ రంగంలోకి దిగారు. దేశంలో యువత దారి తప్పలేదని, వారు లేవనెత్తుతున్న ప్రశ్నలకి బలప్రయోగం ద్వారా కాకుండా సహనంతో సమాధానాలు చెప్పి వారిని మెప్పించాలని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఆగస్టు 6న ముంబైలో ఐఐఎంయూఎన్ సదస్సులో పాల్గొన్న ఆయన యువత దేశ వ్యతిరేకులు కాదని, వారి ఆందోళనలు సమర్థనీయమేనని వ్యాఖ్యానించారు. అంటే విద్యార్థి ఉద్యమం పట్ల, వారి డిమాండ్ల పట్ల ప్రభుత్వ వైఖరిని పరోక్షంగా తప్పుబట్టినట్లుగానే భావించాలి.

బంకీపూర్‌లో వాడిన కమలం

రాజకీయంగా బంకీపూర్ ఉప ఎన్నిక కేవలం ఒక సాధారణ ఎన్నికగా కనిపిస్తున్నది. కానీ ఆ ఉపఎన్నికల ఫలితం మాత్రం పెద్ద సందేశాన్ని ఇచ్చింది. దేశంలో విద్యార్థి ఉద్యమ సమయంలో జరిగిన ఎన్నికలో ప్రతికూల ఫలితం రావడం రాజకీయ వర్గాలలో పెద్ద చర్చకే దారితీసింది. 30 సంవత్సరాలకు పైగా బంకీపూర్‌లో వరుసగా 8 పర్యాయాలు అప్రతిహత విజయాలు సాధిస్తున్న బీజేపీ రాష్ట్రంలోనే ప్రాతినిధ్యం లేని ఒక చిన్న పార్టీ చేతిలో ఓడిపోవడం మామూలు విషయమేమీ కాదు.

దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీకి జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన శాసనసభ నియోజకవర్గంలో 19 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ పరాజయం పాలుకావటం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నది. కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటం ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు ప్రచారం చేసినా జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో ఓటమి పార్టీ ప్రతిష్టను ఫణంగా పెట్టిందనే చెప్పాలి. తొమ్మిది నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇదే బంకీపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 52 వేల ఓట్ల ఆధిక్యతతో నెగ్గితే, తాజా ఉప ఎన్నికలో మాత్రం బీజేపీ ఓడిపోయింది.

బీహార్ శాసనసభ ఎన్నికలలో 234 శాసనసభ నియోజకవర్గాలలో డిపాజిట్లు కోల్పోయిన జన సురాజ్ పార్టీ గత ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో కేవలం 7717 ఓట్లకే పరిమితమైంది. కానీ, ఉప ఎన్నికలో మాత్రం 64,151 ఓట్లు సాధించి దేశంలోనే అత్యంత పాపులర్ ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన  ప్రశాంత్ కిషోర్ గెలుపొందటం బీజేపీకి రాజకీయంగా నష్టం కలిగించేదే. ఆర్జేడీ పోటీతో ప్రభుత్వ వ్యతిరేక  ఓట్లలో చీలిక వచ్చినా, బలమైన కాయస్థ సామాజిక వర్గం నుంచి బీజేపీ తన అభ్యర్థిని నిలిపినా ఓటమి చెందటం అనూహ్య పరిణామంగానే చూడాలి.

32.5 శాతంతో బీహార్‌లోనే అత్యధికం గా ఉన్న జెన్- జీలు ఎన్నికపై ప్రభావాన్ని చూపించి బీజేపీకి బలమైన నియోజకవర్గంలో ఆ పార్టీ ఓటమికి కారణమయ్యారు. బంకీపూర్ నియోజకవర్గంలో జెన్ జీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఓటమెరుగని నియోజకవర్గంలో పరాజయం చెందాల్సి వచ్చిందని అగ్ర నాయకత్వం భావిస్తున్నది.

మధ్యప్రదేశ్ దాత్య శాసనసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ చేతిలో ఓటమి, గుజరాత్‌లోని మంజల్‌పూర్ శాసనసభ స్థానంలో గెలిచినా మెజార్టీ భారీగా పడిపోవడం బీజేపీని కలవరపెడుతున్నది. పార్టీపై జెన్- జీ, జెన్- ఆల్ఫా యువతలో వ్యతిరేకత పెరిగితే రాబోయే పంజాబ్, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని బీజేపీ అంచనా వేసింది. దిద్దుబాటు చర్యలలో భాగంగా యువతని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది.

అన్ని పార్టీలది అదే దారి

భవిష్యత్తులో యువత రాజకీయాలను, ఎన్నికలను ప్రభావితం చేసే ఒక ప్రభావిత శక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని పార్టీలు యువతని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గత దశాబ్ద కాలంగా యువత బీజేపీకి బలమైన మద్దతుదారుగా నిలిచింది. కానీ, కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి ఉద్యమం తరువాత ఆ యువతే తమ బలహీనతగా మారకుండా బీజేపీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. విద్యార్థులకు మద్దతుగా క్షేత్రస్థాయిలో,

పార్లమెంట్‌లో ఆందోళనల ద్వారా యువతను ఆకర్షించాలని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా యువత, నిరుద్యోగుల నుంచి ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తమయ్యే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయి. విపక్షాలు కూడా నిరుద్యోగులు, యువత సమస్యలపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. దేశంలోని యువత వ్యవస్థల ప్రక్షాళన కోసం వ్యవస్థాగత వైఫల్యాలకు వ్యతిరేకంగా ఉద్యమబాట పట్టడం శుభపరిణామం.

 వ్యాసకర్త సెల్: 9885465877