అర్ధరాత్రి స్వాతంత్య్రం ఎందుకంటే?
హిందూ క్యాలెండర్ ప్రకారం తిథులు సూర్యోదయంతో ప్రారంభమవుతాయి. కానీ, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం తేదీ అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. ఈ వ్యత్యాసమే అర్ధరాత్రి స్వాతంత్య్ర వేడుకకు కారణమైంది. రెండు వైపులా గెలుపుగా కనిపించిన ఈ పరిష్కారం వాస్తవానికి ఒక అనివార్య రాజీ.
మనం మరికొద్ది రోజుల్లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న తరుణంలో స్వర్ణోత్సవ (గోల్డెన్ జూబ్లీ) వేడుకలు సహజంగానే గుర్తుకొస్తాయి. ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ గుర్తుగా అప్పట్లో నిర్వహించిన అర్ధరాత్రి కార్యక్రమాలు, నిద్రమత్తు కళ్లతో ఆ సమయంలో పడిన ఇబ్బందులు గుర్తుకొస్తుంటాయి. దేవుడి దయ వల్ల ఈసారి మనకు అలాంటి రాత్రివేళ వేడుకల తిప్పలు తప్పాయి. కానీ, ఇప్పటికీ ఒక ప్రశ్న నిరంతరం మెదులుతూనే ఉంటుంది. అదేమిటంటే అసలు మనం అర్ధరాత్రి వేళ స్వేచ్ఛను ఎందుకు కోరుకున్నాం? అది మన నిర్ణయమా లేక అనివార్యమైన పరిస్థితా? మన ‘విధితో ముఖాముఖి’ (ట్రైస్ట్ విత్ డెస్టినీ)కి ఆ అర్ధరాత్రి వేళలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఎక్కువ మందికి తెలియని ఒక చిన్న కథ ఉంది. ఆ కథను ఇక్కడ వివరిస్తున్నాను.
ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, నేను నా జ్ఞాపకాలను 1980ల నాటికి తీసుకెళ్లాలి. అప్పట్లో నేను జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నప్పుడు ఒక సంవత్సరం విరామం వచ్చింది. ఎం.ఫిల్ కోర్సు వర్క్‌ను అధిక గ్రేడ్ పాయింట్‌తో పూర్తి చేయడంతో నేరుగా పీహెచ్‌డీకి అర్హత సాధించాను. (అప్పట్లో అది నా మొదటి ప్రాధాన్యత కాకపోయినా దరఖాస్తు చేసుకున్నాను). అయితే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి నాకింకా వయస్సు సరిపోలేదు.
నేను ఖాళీగా ఉండటంతో, నా ప్రొఫెసర్, గైడ్ నన్ను ఒక పనిలో సహాయం చేయాలని కోరారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన రచయితలు లారీ కొల్లిన్స్, డొమినిక్ లాపియర్ (‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ పుస్తక రచయితలు) చివరి వైస్రాయ్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటెన్‌కు సంబంధించిన వ్యక్తిగత పత్రాలు, ప్రైవేట్ పత్రాలను సేకరించారు. వాటిని సవరించడంలో (ఎడిట్) సహాయపడమన్నారు. అలా నా ముందు పెద్ద ఎత్తున సమాచారం వచ్చి పడింది.
వాటి నుంచి కొత్త ప్రచురణల కోసం విషయాలను వెలికితీసే పనిలో మునిగిపోయాను. ఆ తర్వాత అవి ‘మౌంట్‌బాటెన్ అండ్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా’, ‘మౌంట్‌బాటెన్ అండ్ ఇండిపెండెంట్ ఇండియా’ అనే రెండు విడివిడి సంపుటాలుగా వెలువడ్డాయి. అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ పరిశోధన సమయంలో, ఆ పుస్తక రచయితలు లార్డ్ మౌంట్‌బాటెన్‌ను చేసిన ఒక ఆసక్తికరమైన ఇంటర్వ్యూ నా కంటపడింది. ఆ రికార్డ్ చేసిన ఇంటర్వ్యూ ‘మౌంట్‌బాటెన్ అండ్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా’ మొదటి భాగంలో ప్రచురితమైంది. మౌంట్‌బాటెన్ తనదైన అహంకారం, నిర్లక్ష్య వైఖరితో ఈ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలలో పంచుకున్న విషయాలను ఆయన మాటల్లోనే విందాం.
ప్రశ్న: ఆగస్టు 15న వేడుకలు నిర్వహించడానికి ముందస్తు ఉదాహరణలు ఏవీ లేవు. దాన్ని ఎవరు కనిపెట్టారు, ప్రణాళిక చేశారు?
సమాధానం: నేను దీని గురించి నెహ్రూ తో చర్చించాను. ఇందులో మొదటి, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏం టంటే... నేను ఆగస్టు 15ను ఎంచుకోవడానికి కారణం, సరిగ్గా రెండేళ్ల క్రితం (సింగపూర్‌లో మిత్రదేశాల దళాల కమాండర్‌గా నా ముందు) జపాన్ లొంగిపోయిన తేదీ అది. కానీ నేను జ్యోతిష్కులను సంప్రదించలేదు. మీకు తెలిసినట్లుగా, భారతీయులకు జ్యోతిషంపై నమ్మకం ఎక్కువ. నాకా విషయం తెలియదు. అశుభకరమైన రోజున వారు ఏ పనీ చేయరు. నెహ్రూకు జ్యోతిషంపై నమ్మకం లేకపోయినా, చాలామంది నమ్ముతారని, నేను ఎంచుకున్నది మంచి రోజు కాదని ఆయన చెప్పారు. జ్యోతిష్కులను సంప్రదించకపోవడం నా పొరపాటే.
కానీ నేను ఆ విషయాన్ని మరిచిపోయాను. అప్పుడు ఆయన, ‘పరవాలేదు. మనం అర్ధరాత్రి సమావేశం ఏర్పాటు చేసుకుని, అర్ధరాత్రి గడియారం కొట్టే ముందు అధికార మార్పిడి చేసుకుంటే, అది ఇంకా శుభప్రదంగా ఉంటుంది’ అని చెప్పారు. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ అర్ధరాత్రి సమావేశం నిర్వహించడం ఎంత అద్భుతమైన,
నాటకీయమైన ఆలోచన అని నేను అనుకున్నాను. మీరు గుర్తుంచుకోవాలి, ఇది ఏదో నాటకీయ సమయం కోసం చేసింది కాదు, నేను తప్పు రోజును ఎంచుకోవడం వల్ల జరిగింది! ఎందుకంటే అది శుభప్రదమైన రోజు కాదని జ్యోతిష్కులు చెప్పారు కాబట్టి!
ఇదీ సంగతి... వైస్రాయ్ అహంకారానికి, జ్యోతిష సర్దుబాటు లేదా ‘ఉపాయానికి’ మధ్య జరిగిన ఒక అసౌకర్య రాజీ ఫలితంగానే అర్ధరాత్రి స్వాతంత్య్రాన్ని మనపై శాశ్వతంగా రుద్దారు. స్వార్థపరుడైన వైస్రాయ్ ఏకపక్షంగా తేదీని నిర్ణయించగా, భారతీయ నాయకులు ఆయన స్వచ్ఛంద నిర్ణయాలకు ముక్తకంఠంతో లొంగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది! నెహ్రూ ఈ విషయాన్ని ఇతర నాయకుల వద్ద ప్రస్తావించినప్పుడు, ముఖ్యంగా సర్దార్ పటేల్, జె.బి. కృపలాణిల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారు ఆ అశుభకరమైన రోజును నివారించాలనుకున్నారు. చివరికి, ఈ చిక్కుముడిని విప్పడానికి ఒక చతురతతో కూడిన జ్యోతిష ఉపాయంపై ఆధారపడవలసి వచ్చింది.
హిందూ క్యాలెండర్ ప్రకారం తిథులు సూర్యోదయంతో ప్రారంభమవుతాయి. కానీ, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం తేదీ అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. ఈ వ్యత్యాసమే అర్ధరాత్రి స్వాతంత్య్ర వేడుకకు కారణమైంది.
రెండు వైపులా గెలుపుగా కనిపించిన ఈ పరిష్కారం వాస్తవానికి ఒక అనివార్య రాజీ. ప్రజల భావాలను పట్టించుకోని వైస్రాయ్ నిర్ణయానికి భారతీయ నాయకులు తలవంచడం విచారకరం.
అలా, అర్ధరాత్రి స్వాతంత్య్రం మన ‘విధితో ముఖాముఖి’గా మారింది. హాంకాంగ్ వంటి కొన్ని దేశాలు కూడా ఈ పద్ధతిని అనుసరించాయి. అయితే మనకు ఇది స్వాతంత్య్ర ఆరంభ దశలోని ఒక విచిత్రమైన రాజీకి ప్రతీకగా మిగిలిపోయింది.
వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర విశ్రాంత స్పెషల్ చీఫ్ సెక్రటరీ (bpacharya@gmail.comలో ఆయనను సంప్రదించవచ్చు.)






