15 March, 2026 | 10:11 AM

ఎన్నికల శిక్షణా కేంద్రాలను పరిశీలించిన సాధారణ పరిశీలకులు

04-12-2025 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 3,(విజయక్రాంతి):గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల పర్యవేక్షణకు నియమితులైన పరిశీలకులు వి. సర్వేశ్వర్ రెడ్డి బుధవారం జిల్లా లోని పలు మండలాలను సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న లోపం చోటుచేసుకోకుండా అధికారులు అత్యంత బాధ్య తతో వ్యవహరించాలని ఆయన సూచనలు చేశారు.

ముందుగా ఆయన ఆర్వోలు, ఏ ఆర్ ఓ ల శిక్షణ కేంద్రాలను సందర్శించారు. పరిశీలనలో భాగంగా పాల్వంచ మండలంలోని అనుబోస్ కాలేజీలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని తనిఖీ చేసి, శిక్షకులు ఇస్తున్న మార్గదర్శకాలు, శిక్షణ పాఠ్యాంశాలు, హాజరు రికార్డులు వంటి అంశాలను వివరంగా పరిశీలించారు. అనంతరం బర్గంపహాడ్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల , భద్రాచలం మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి అందజేస్తున్న  నామినేషన్ ప్రక్రియ, కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల రోజున చేపట్టాల్సిన వివిధ విధులపై శిక్షణ నాణ్యతను సమీక్షించారు. శిక్షణా కేంద్రాల్లో మౌలిక వసతులు, సమృద్ధిగా ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనవి. ప్రతి ఆర్వో , ఏ ఆర్ ఓ లు ఎన్నికల సిబ్బంది చట్టబద్ధంగా తమకు కేటాయించిన విధులను అత్యంత జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. శిక్షణా దశలోనే అన్ని విధానాలు పూర్తిగా అవగాహన చేసుకుని తర్వాత క్షేత్రస్థాయిలో పనులు చేపట్టాలి.

చిన్న తప్పిదం కూడా ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున ప్రతి చర్యలో జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని సూచనలు, మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని ఆయన అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. తదుపరి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పరిశీలకులు లక్ష్మిదేవిపల్లి మండలంలోని జీపీ లక్ష్మిదేవిపల్లి, జీపీ శ్రీనగర్ కాలనీ అలాగే సుజాత్నగర్ మండలంలోని జీపీ సీతంపేట బంజారా, జీపీ సర్వారం కేంద్రాలను సందర్శించారు.

నామినేషన్ స్వీకరణ, రికార్డు నిర్వహణ, భద్రత, సిబ్బంది హాజరు, క్యూలైన్ వ్యవస్థ మొదలైన అంశాలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని పరిశీలకులు తెలిపారు.