నేడు కొండగట్టులో గిరి ప్రదక్షిణ
- మంత్రుల రాక రాజకీయాలకు అతీతంగా భక్తులందరూ పాల్గొనాలని
- చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం
కరీంనగర్, జూలై 28 (విజయ క్రాంతి): కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం బుధవారం నిర్వహి స్తున్నామని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని, సకల జనుల సంక్షేమం కోసం చేస్తున్న ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా భక్తులందరూ పాల్గొనాలని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం కోరారు.
మంగళవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా కురవాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ గిరి ప్రదక్షిణ, ఇది కేవలం ఒక పార్టీ కో ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించిన కార్యక్రమం కాదని అన్నారు. ముఖ్యంగా ఎల్ నీనో ప్రభావంతో రైతుల ఇబ్బందులు తొలిగిపోవాలని సకలజనుల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమమని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అనేక దేవాలయాలలో అభివృద్ధి కొనసాగుతుందన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరాలయం, బాసర, కాలేశ్వరం, ధర్మపురి కొండగట్టు ఆలయాల అభివృద్ధి కోసం ప్ర త్యేకంగా చొరవ తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, చొప్పదండి సహకార పరపతి చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గంగన్న, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.






