18 May, 2026 | 2:09 AM

అమ్మాయిలదే హవా

18-05-2026 01:29 AM
  1. ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేశవరావు
  2. టాప్ టెన్ ర్యాంకుల్లో అబ్బాయిల పైచేయి 
  3. అగ్రికల్చర్, ఫార్మసీలో 1.55 శాతం తగ్గిన ఉత్తీర్ణత, ఇంజినీరింగ్‌లో 0.1 శాతం వృద్ధి 
  4. వారం రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్, మే 17(విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో 2026 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ ఫలితాలు విడుద లయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిలు అత్యధిక ఉత్తీర్ణత సాధించి టాప్‌లో నిలిచారు. ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూేొహెచ్‌లో ఆదివారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్య, కళాశాల విద్యా కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫె సర్ వీ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టీయూ వర్సిటీ వీసీ కిషన్ కుమార్‌రెడ్డి, ఎప్‌సెట్ కన్వీనర్ కే విజయకుమార్‌రెడ్డి, వర్సిటీ రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర్‌రావుతో కలిసి విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో బాలికలు 73.72 శాతం, బాలురు 73.10 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో బాలికలు 86.76 శాతం, బాలురు 84.70% ఉత్తీర్ణత సాధించారు. 

మొత్తంగా చూస్తే ఇంజినీరింగ్ విభాగంలో బాలబాలికలు 2,10,766 మంది దరఖాస్తు చేసుకోగా 1,97,242 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 1,44,704 (73.36 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 90,977 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 84,954 మంది పరీక్ష రాశారు. వీరిలో 73,294 (86.27 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగం లో ఒక ట్రాన్స్‌జెండర్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగం లో గత ఏడాది 73.26 శాతం మంది అర్హత సాధించగా ఈసారి 73.36 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 0.1 శాతం ఉత్తీర్ణత పెరిగింది. అగ్రికల్చర్,ఫార్మసీలో గత సంవత్సరం 87.82 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈసారి 87.82 అర్హత సాధించారు. గత ఏడాది కంటే 1.55 శాతం ఉత్తీర్ణత తగ్గింది.  

తెలంగాణ, ఏపీకి చెరి సగం    

ర్యాంకుల పరంగా చూస్తే టాప్ టెన్‌లో అబ్బాయిలు పైచేయి సాధించారు. ఇంజనీరిం గ్ విభాగంలో తెలంగాణలోని ఉప్పల్‌కు చెం దిన ఎం.రుషి, అగ్రికల్చర్ ముక్క రం అహ్మద్ మొదటి ర్యాంకు సాధించారు. ఇంజినీరింగ్‌లో ఏపీకి రెండు ర్యాంకులు దక్కగా, అగ్రికల్చర్, ఫార్మసీలోనూ ముగ్గురు ఏపీ వాళ్లే ఉన్నారు. తెలంగాణ, ఏపీ విద్యార్థులు టాప్ ర్యాంకుల్లో దాదాపు చెరి సగం దక్కించుకున్నారు. ఈనెల మే 4, 5 తేదీ ల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరిగాయి. ఎప్ సెట్ ముగిసిన ఆరో రోజే ఫలితాలను వెల్లడించడం గమనార్హం.  ఈసారి కంప్యూటర్ స్క్రీన్ పైన ప్రాథమిక కీ ఆధారంగా మార్కులు ప్రత్యక్షమ య్యేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.

త్వరలో అడ్మిషన్లు

ర్యాంకుల ఆధారంగా  కాలేజీల్లో సీట్ల భర్తీకి వారం రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. గతంలో విద్యార్థుల నుంచి దాదాపు 3 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చేవని, ఈసారి 16 మాత్రమే వచ్చాయని,  పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం వల్ల అభ్యంతరాలు గణనీయంగా తగ్గినట్లు వారు పేర్కొన్నారు. పరీక్షలను విజయంతంగా నిర్వహించిన అధికారులు, ఉత్తమ ర్యాంకులు కనబరిచిన విద్యార్థులను అభినందించారు.   

గత మూడేళ్ల ఉత్తీర్ణత శాతాలు

సం. ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ

2026 73.36 86.27

2025 73.26 87.82

2024 74.98 89.67