25 July, 2026 | 1:52 AM

ముక్తి ప్రదాయిని గీతాజ్ఞానం

28-06-2024 12:05 AM

కలకుంట్ల జగదయ్య

విశ్రాంత తెలుగు పండితులు

ప్రపంచంలో ఎన్నో ‘గీత’లు వున్నాయి. అష్టవక్ర గీత, అవధూత గీత, బ్రహ్మ గీత, వశిష్ట గీత, గణేశ గీత, హనుమద్గీత, పరాశర గీత, హరిత గీత, శివగీత, హంస గీత, భిక్షు గీత, కపిలగీత, దేవీగీత. ఇవన్నీ విశ్వసాహిత్యంలో ప్రచారంలో వున్నా యి. అయితే, ‘భగవద్గీత’ ఒక్క దానికే ‘గీత’ అన్న పేరు చక్కగా రూఢీ పడింది. ఇందులోని సులభశైలి, విష య గాంభీర్యం, సమన్వయ దృష్టి మానవాళి అంతటికినీ ఆచరణ యోగ్యమైన అనుష్ఠాన పద్ధతులు మొదలైన విషయాల వల్ల దాని వ్యాపకత్వాన్ని సర్వజనులు ఆదరిస్తున్నారు. ‘భగవద్గీత’ అన్న పేరులోనే ఒక విధమైన విశాలభావం వ్యక్తమవుతుంది. ఎందుకంటే, శ్రీకృష్ణుడు బోధించింది దానికి ‘కృష్ణ గీత’ అని పేర్కొనకుండా ‘భగవద్గీత’ అని, అలా పరమాత్మ పేరుతోనే అది చలామణి అయిందంటేనే  దాని విలువు, స్థాయిని అర్థం చేసుకోవచ్చు. 

గతించిన వ్యక్తుల పుట్టిన రోజు (జయంతి)ను జరుపుకున్నట్లుగా భగవద్గీతకు ‘గీతా జయంతి’ పేరున వేడుకను జరుపుకుంటాం. ప్రపంచంలో ఎన్నో గీతలు వున్నా ఏ గీత కూ ఇలా ‘జయంతి’ని జరుపుకోం. భగవంతుడు రణరంగంలో అర్జునునికి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతోపదేశం చేశాడు. అందుకే, ఆ దినాన్ని ‘మహా పర్వదినం’గా మనం భావిస్తున్నాం. ఆ రోజున గీతాగ్రంథా న్ని, శ్రీకృష్ణ పరమాత్మను, శ్రీ వేదవ్యాసుల వారిని, అర్జునులను పటాల రూపంలో పూజిస్తాం. గీతా పారాయణం, గీతా ప్రవచనం, గీతా సంబంధ సేవలు కొనసాగిస్తాం. ‘గీత సేవే భగవత్ సేవ’గా భావించి గీతావ్యాప్తికి ఎవరికి తోచిన మేరకు వారు చేయూతనివ్వ డమే మానవధర్మం. 

వైష్ణవీయ తంత్రసారం నుండి గ్రహించిన గీత మహి మ అనన్య సామాన్యం. నైమిశారణ్యంలో శౌనకాది మునులు సూత మునీంద్రుని గీతా మహిమను గురిం చి తెలుపమని ప్రార్థించారు. వారి ప్రార్థనలను మన్నిం చి సూత మహాముని దానిని వివరించారు. “పూర్వం నారాయణ క్షేత్రంలో శ్రీ వ్యాస మునీంద్రుడు చెప్పిన గీతా మహిమను విన్నది విన్నట్లు నేనూ మీకు చెప్తాను, వినండి..” అని మొదలుపెట్టాడు. అది గోప్యమైంది, సర్వోత్తమమైంది. నిజానికి గీతా మహిమను ఎవరు చెప్పగలరు? దీనిని పూర్తిగా తెలిసినవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. అర్జునునికి దానిని గురించి ఒకింత మాత్రమే తెలిపాడు. వ్యాసుడుగాని, శుకుడుగాని, యాజ్ఞవల్క్యు డు గాని కొంతమాత్రమే తెలుసుకొన్న వారు. ‘ఉపనిషత్తులు’ అనే ఆవులనుండి శ్రీకృష్ణమూర్తి ‘పాలు పితికేవా డు’ అయితే, అర్జునుడు దూడ. మహత్తరమైన గీతామృతమే పాలు. సద్బుద్ధి గలవాడే ఆ పాలను సేవిస్తాడు. సంక్లిష్టమైన సంసార సాగరాన్ని దాటడానికి భగవద్గీత ఒక నావలా ఉపయోగపడుతుంది. ఎవరు గీతా శాస్త్రా న్ని అహర్నిశలు శ్రవణం చేస్తారో వారు నిస్సంశయంగా దైవ స్వరూపులే.

ముక్తిదాయకమైన గీతలోని 18 అధ్యాయాలను పఠించే వారికి భక్తితో కూడిన కర్మలు అలవడతాయి. చిత్తశుద్ధి మరింత వృద్ధి చెందుతుంది. గీతాక్షర జలంలో స్నానం చేసినవారికి సంసార మాలిన్యాలు తొలగిపోతాయి. విష్ణు పర్వదినాలలో ఏకాదశి వంటి ప్రత్యేక దినాలలో దీనిని పఠించడం వల్ల రెట్టింపు ఫలం లభిస్తుంది. సాలగ్రామ శిలవద్దగాని, దేవాలయంలోగాని, తీర్థ స్థానంలోగాని, నదీ తీరంలోగాని గీతను భక్తిశ్రద్ధలతో పారాయణం చేయగలిగితే ‘ఉత్తమ సిద్ధి’ని పొందుతారు. గీతా గ్రంథాన్ని పూజించే గృహంలో ఏ బాధలూ ఉండవు. గీతాభాష్య తత్పరుడు ఎలాంటి కర్మలతోనూ అంటబడడు.

పాపాలు వారిని చేరవు. అనాచా రం, అభక్షసేవనం, స్పృశింప రాని వారిని స్పృశించుట, తెలిసీ తెలియక చేసిన పాపాలు.. వంటివన్నీ గీతా పఠనం వల్ల నశించిపోతాయి. అన్నిచోట్ల భోజనం చేసిన వారు, అన్ని దానాలను తీసుకున్న వారి పాపాలు గీతా పఠనంతో తొలగిపోతాయి. గీతా పఠనం జరిగే స్థలం దగ్గరికి బాలకృష్ణుడు, నారదుడు, ధృవుడు మొదలైన వారు వచ్చి నిలబడతారు.  భగవంతుడు అర్జును నితో ఈ విధంగా అన్నాడు. “గీతయే నా హృదయం. గీతయే నా ఉత్తమ తత్త్వం. గీత యే నా జ్ఞానం. గీతయే నా స్థానం, గీతయే నా పరమ రహస్యం. గీతయే నా పరమ గురువు. గీతయే నా ఉత్తమ గృహం. గీతయే బ్రహ్మ స్వరూపం”.

గీతలోని మూడు భాగాలను పఠించిన వారికి సోమయాగం చేసిన ఫలం లభిస్తుంది. రెండు అధ్యాయాలను పఠించిన వారికి ఇంద్రలోకం సిద్ధిస్తుంది. అంత్యకాల సమయంలో గీతలోని ఒక శ్లోకాన్నిగాని, ఒక పాదాన్నిగాని, ఒక పదాన్నిగాని స్మరించి, మరణిస్తే ‘పరమాత్మ పదం’ పొందుతారు. గీతా పుస్తకాన్ని చేత పట్టుకొని మరణించిన వారు వైకుంఠం చేరుకుంటారు. విష్ణువుతో ఆనందం అనుభవిస్తారు. గీతను పఠిస్తూ ఏ కర్మ చేసినా అది సఫలమవుతుంది. శ్రాద్ధకర్మలలో గీతాపఠనం చేయడం వల్ల పితరులు ఎంతో సంతృప్తి చెంది, వారి సంతతిని ఆశీర్వదిస్తారు. గీతా పుస్తకాన్ని చేతిలో పట్టుకొని గోదానం చేస్తే తక్షణం కృతార్థులమవుతాం. గీతా పుస్తకాన్ని విద్వాంసులైన బ్రాహ్మణులకు దానం ఇచ్చిన వారికి పునర్జన్మ వుండదు. గీతాదాన ప్రభావంతో విష్ణు లోకం పొంది, ఏడు కల్పాల వరకు విష్ణువుతో ఆనందిస్తారు. గీతను ఆశ్రయించి జనకాదిరాజ శ్రేష్ఠులు ఎందరో కైవల్య పదాన్ని పొందారు. 

భగవద్గీతే లేకపోతే..

మాక్స్ ముల్లర్, ఎడ్విన్ ఆర్నాల్డ్, అనిబిసెంట్ మొదలైన పాశ్చాత్యులు అనేకులు గీత ప్రభావానికి, విషయ గాంభీర్యానికి ఆకర్షితులైనారు. గీతోపదిష్ట బోధనలతో తమ జీవితాలను సంస్కరించుకున్నారు. -అంతేకాదు, గీతను బాగా ప్రచా రం చేశారు. ఎడ్విన్ ఆర్నాల్ మహనీయుడు ‘దివ్యగీతము’ పేరుతో అందులోని 18 అధ్యా యాలను ఆంగ్లంలోకి పద్యరూపంలో రచించా డు. హూణభాషలో అది చాలా విఖ్యాతమైన గ్రం థం. గీత ఔన్నత్యాన్ని గురించి అతను పలికిన పలుకులు గీతపట్ల ప్రజలకుగల శ్రద్ధ, భక్తి ప్రపత్తులను మరింత ఇనుమ డింప జేశాయి. ‘భగవద్గీతే కనుక లేకపోతే, ఆంగ్ల సాహిత్యం అసంపూర్ణంగానే ఉండేదని’ ఎడ్విన్ అభిప్రాయ పడ్డాడు. భగ వద్గీత ఆంగ్లంలోనేగాక ప్రపంచంలోని ప్రముఖ భాషలన్నింటిలోకీ అనువాదమైంది.