3 September, 2026 | 7:35 AM

ప్రతి ఇంట్లో ఓ కళాఖండం ఉండాలి

08-06-2024 | 01:34am

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి): కళ అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రతి ఇంట్లో ఓ కళాఖండం ఉండాలని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నగరంలోని రేతిబౌళిలో గల కింగ్స్ కోహినూర్ (క్రౌన్స్) కన్వెన్షన్‌లో ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మొదటిసారి నిర్వహిస్తున్న జాతీయ ఆర్ట్ ఫెస్టివల్‌ను శుక్రవారం ఆర్ట్ కలెక్టర్ పార్వతీరెడ్డి, ఎన్‌ఏఆర్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కే లక్ష్మాగౌడ్, ప్రముఖ కళాకారుడు అంజు పొద్దార్ ఆర్ట్ కానాయిజర్, ఐఏఎఫ్ డైరెక్టర్ రాజేంద్ర పాటిల్‌తో కలిసి మంత్రి జూపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అనంతరం వివిధ గ్యాలరీలలో ఏర్పాటు చేసిన కళా ఖండాలను నిర్వాహకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు.  ప్రతి ఇంట్లో అందమైన ల్యాండ్ స్కేప్ పెయింటింగ్స్, శిల్పం, ఏదైనా కళా ఖండం ఉండాలని చెప్పారు. అవి ఇంటిని ప్రకాశవంతంగా చేస్తాయని అన్నారు. రాష్ట్రంలో కళలు, చేతివృత్తుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి, వివిధ నగరాల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు.

నేడు, రేపు కొనసాగనున్న ఆర్ట్ ఫెస్టివల్..

శుక్రవారం ప్రారంభమైన ఆర్ట్ ఫెస్టివల్‌లో దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి 250 మంది కళాకారులు పాల్గొన్నారు. ప్రఖ్యాత కళాకారులు జోగెన్ చౌదరి, మను పరేఖ్, కిషన్‌ఖన్నా, శక్తిబర్మన్, సీమాకోహ్లీ, పరేష్‌మైతీ, యూసుఫ్ అరక్కల్, ఎస్‌జీ వసుదేవ్ సహా పలువురు కళాకారులకు చెందిన కళా ఖండా లు 30 గ్యాలరీలలో ఏర్పాటు చేశారు. 3,500 కళా ఖండాలు ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఉన్నాయి. సింగపూర్ నుంచి కూడా కళాకారులు పాల్గొనడం విశేషం. నగరంలోని కళా ప్రియుల కోసం నేడు, రేపు (శని, ఆదివారం) ఫెస్టివల్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆర్ట్ ఫెస్టివల్‌ను వీక్షించాలనుకునే వారి కోసం బుక్‌మై షోలో రూ.299కే టికెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.