ట్రంప్ విధానాలతో ప్రపంచ సంక్షోభం
ఐ.ప్రసాదరావు :
మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే నినాదంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేప ట్టారు. నాటి నుంచి అమెరికాతో పాటు మొత్తం ప్రపంచ దేశాలను అనేక రకాలుగా ఆయన భ్రష్టుపట్టిస్తున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయపరంగా ప్రపంచాన్ని అస్థిరతకు గురిచేస్తుండటంతో ప్రతీ దేశం కొవిడ్ నాటి దుస్థితిని చవిచూస్తున్నది. దీనంతటికీ ట్రంప్ విధానాలు, ఆయన వైఖరే కారణమని చెప్పక తప్పదు.
అమెరికా ఒక వలసల దేశం. వలసదారుల మేధోసంపత్తి, శ్రమశక్తితోనే అమెరికా అభివృద్ధి చెందింది. ఈ వాస్తవాన్ని మరచి, వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ మొత్తం ప్రపంచ దేశాలకు ట్రంప్ శత్రువుగా మారారు. దాంతోపాటు స్వదేశంలో ఆర్థిక, సామాజిక సమస్యలకు కారణమయ్యారు. ఇక అక్రమ వలసదారులంటూ చాలామందిని సంకెళ్లతో ఆయా దేశాలకు పంపించారు.
ఈ పరిస్థితిని మన దేశం కూడా చవిచూసింది. దీనిపై మన ప్రధాని సైతం సరిగ్గా స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. అదే సమయంలో ట్రంప్ నిర్ణయంపై కొలంబియా అధ్యక్షుడు నిర్భీతితో స్పందించడంపై ప్రశంసలు రావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలుగా అనేక దేశాల విద్యార్థులు హార్వర్డ్, కాలిఫోర్నియా వంటి యూనివర్సిటీల్లో చదివేందుకు అమెరికాకు క్యూ కడుతున్నారు. ప్రతిష్టాత్మకమైన ఆ యూనివర్సిటీలపైనా ట్రంప్ కక్ష సాధింపునకు దిగడంపై సర్వత్రా విమర్శ లు వ్యక్తమయ్యాయి. దీంతో విద్యార్థుల్లో అమెరికా పట్ల, ముఖ్యంగా ట్రంప్ విధానా లు పట్ల వ్యతిరేకత పెరిగింది. అప్పటినుంచి ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలకు అంతర్జాతీయ విద్యార్థులు క్యూ కట్టడంతో విద్యాపరంగా అమెరికా ప్రతిష్ట దెబ్బతింది.
ఇక హెచ్‌హే వీసాల నిబంధనలను కఠినతరం చేయడంపై చాలా దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా యి. ముఖ్యంగా మన దేశం నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గిం ది. అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం చేయడానికి జంకే పరిస్థితిని ట్రంప్ కల్పించడంతో వెనుకడుగు వేసిన పలు దిగ్గజ సంస్థలు, పెట్టుబడిదారులు బ్రిటన్, గల్ఫ్ దేశాలను తమ గమ్యస్థానంగా మార్చుకున్నారు. దీంతో ఉత్పత్తి రంగం దెబ్బతింది. వలస నిబంధనల కారణంగా సాఫ్ట్‌వేర్ కూడా కుదేలైంది. అమె రికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దీని ప్రభా వం ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా పడుతున్నది.
ప్రతీకార సుంకాలు విధింపుతో చైనా మినహా దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అధోగతి పాలవుతున్నాయి. తన దేశానికి డాలర్ల వర్షం కురుస్తుందని గుడ్డిగా నమ్మిన ట్రంప్.. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో చెలగాటమాడారు. దానివల్ల అన్ని దేశాల జీడీపీ దిగజారే ప్రమాదం ఏర్పడింది. మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నాలుగో స్థానం నుంచి ఆరో స్థానంలోకి పడిపోయింది.భారత్ అంటే తనకు ఎంతో అభిమానమని, మోదీ తన మిత్రుడని పైకి అంటున్న ట్రంప్.. భారత్‌ను, భారతీయులను అనేక రకాలుగా ఇబ్బందుల పాల్జేస్తు న్నారు. ముఖ్యంగా ఆక్వా, వస్త్ర, బంగారం, డైమండ్, ఇతర పరిశ్రమల ఎగుమతులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ట్రంప్ గద్దెనెక్కిన మొదట్లో రష్యా -ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని నమ్మించా రు. కానీ, చివరికి ఉక్రెయిన్‌కు హ్యాండిచ్చా రు. తదుపరి కెనడా, మెక్సికో వంటి దేశాలతో కయ్యానికి కాలుదువ్వారు. గ్రీన్‌ల్యాం డ్ కావాలంటూ మొత్తం నాటో, యూరప్ దేశాలకు దూరమయ్యే పరిస్థితిని కల్పించుకున్నారు. ఈ క్రమంలో ఐరాస నుంచి దూరంగా జరిగి, ప్రత్యామ్నాయ వ్యవస్థకు రూపకల్పన చేయడం తప్ప ఆయన ఏమీ సాధించలేదు. ప్రపంచం ఆరోగ్య సంస్థకు నిధులు ఇవ్వడం లేదు. దీంతో అనేక రకా ల వైద్య సేవలందక ఆఫ్రికా దేశాలు ఇబ్బం ది పడుతున్నాయి. ఆఫ్రికా దేశాలు కూడా దాదాపు అమెరికాకు దూరమయ్యాయి.
తాజాగా ఇరాన్‌పై యుద్ధానికి దిగడంతో మొత్తం ప్రపంచ దేశాలు నాలుగు నెలలుగా చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి సతమతమవుతున్నాయి. హోర్ము జ్ జలసంధి మూసివేత పెద్ద సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. మన దేశంలోనూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. తత్ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడింది. అనేక కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి.
అసంఘటిత కార్మికుల జీవనోపాధిపై గట్టి దెబ్బ తగిలిం ది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి దాపురించింది. ఈ యుద్ధం వల్ల అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, కువైట్, బహ్రె యిన్ వంటి దేశాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. వీటి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అందరిపై పడింది. రివర్స్ మైగ్రేషన్ పెరిగి నిరుద్యోగం మరింత ఎక్కువైంది.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చాలామంది రోడ్డునపడ్డారు. పారిశ్రామిక, పర్యాటక రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వ్యవసా య, లాజిస్టిక్స్, ఫార్మా వంటి రంగాలు కుదేలయ్యాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు కారణంగా దూరంగా జరిగాయి. యూరోపి యన్ యూనియన్ కూడా అమెరికాకు దూరమైంది.
ప్రపంచానికి ఇంతటి నష్టం జరిగినా, తనకు నోబెల్ పురస్కారం ఇవ్వలేదని ట్రంప్ అవాకులు చెవాకులు పేలడం విడ్డూరం. ఇలాంటి మాటలతో హుందాతనం లేని వ్యక్తిగా ఆయన చరిత్ర పుటల్లోకె క్కారు. ట్రంప్ నిలకడలేని మనస్తత్వం, దుందుడుకు చర్యలు, ఏకపక్ష ఆధిపత్య ధోరణితో తీసుకుంటున్న నిర్ణయాలపై ఇటు స్వదేశంలో, అటు విదేశాల్లోనూ తీవ్ర వ్యతిరేకిత వ్యక్తమవుతున్నాయి.
మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఇలాంటి అధ్యక్షుడిని ఇప్పటి వరకు అమెరికా ప్రజలు చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఆయనపై ప్రజల్లో గౌరవం కూడా తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా ట్రంప్ చేసిన ఆర్థిక, సామాజిక, రాజకీయ నష్టాల నుంచి ప్రపంచ దేశాలు బయటపడటానికి కనీసం ఒక దశాబ్దం పట్టవచ్చు. తాజాగా అమెరికా మధ్య జరిగిన ఒప్పం దం అమలైనా, జరిగిన నష్టం నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుం దనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వ్యక్తి తన ఒంటెద్దు పోకడలతో ఎంత నష్టం కలిగించవచ్చో ట్రంప్ ద్వారా ప్రపంచానికి తెలిసివచ్చింది.
గ్లోబలైజేషన్ ప్రభావంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఒక దేశం మరో దేశంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న ప్రస్తుత తరుణంలో, ప్రపంచంలో ఏ దేశంలోనైనా లేక ఏ ప్రాంతం లోనైనా ఎలాంటి ఉద్రిక్తతలు, సమస్యలు ఏర్పడినా, ఆ ప్రభావం మొత్తం ప్రపంచ దేశాలపై ఉంటుందని మరోసారి తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇకనైనా ప్రతీ దేశం స్వదేశీ ఉత్పత్తులపై ఆధారపడి స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా కొం తమేరకు ఆయా దేశాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయని గ్రహించాలి. అదే సమయంలో ఎగుమతులను పెంచుకొని, దిగుమతులను తగ్గించుకోవాలి.
ఒకటి రెండు దేశాలపైనే ఆధారపడటం మంచిది కాదు. అన్ని దేశాలతో స్నేహపూర్వక దౌత్య సంబంధాలు కలిగి ఉండాలి. ముఖ్యంగా రక్షణ ఖర్చులు తగ్గించాలి. ఆ నిధులను ప్రజా సంక్షేమం కోసం, యవత నైపుణ్యాభివృద్ధికి వెచ్చించాలి. యువత ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి. ప్రభుత్వాలు కూడా విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను బలోపేతం చేయా లి. పారదర్శకంగా పనిచేస్తూ, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఆపాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. అవినీతి, బంధుప్రీతి కుంభకోణాలకు అతీతంగా పాలన చేయాలి. అప్పుడే అస్థిరతకు, అలజడులకు లోనుకాకుండా మన దేశం వికసిస్తుంది.
వ్యాసకర్త సెల్: 6305682733






