25 July, 2026 | 4:41 AM

మహిమాన్విత మహంకాళి

28-06-2024 12:05 AM

అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో.. అమ్మా కాపాడమ్మ.. కరుణించమ్మా.. చల్లంగా చూడు మా అక్క మహంకాళీ.. జై మాతాజీ జై.. జై మహంకాళీ.. అంటూ గల్లీగల్లీలోనూ ఆధ్యాత్మిక వెల్లివిరిసే సమ యం ఆసన్నమైంది. 

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. గ్రామ దేవతలైన అమ్మవారికి ఆషాడ మాసంలో జాతరలు చేసి, బోనా లు సమర్పించుకుంటారు. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండమని, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం.  తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి, బోనం సమర్పించడం ఆనవాయితీ, ఆషాడంలోనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. గోల్కొండ బోనాలతో ఈ బోనాల జాతరలు ప్రారంభ మవుతాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహం కాళి దేవాలయం 1815లో నిర్మితమైనది.

పాత బోయిగూడ  నివాసి అయిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. తన స్వస్థలంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను 1813 సంవత్సరంలో ఉద్యో గ రీత్యా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్దిరోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. అదే సమయంలో మిలటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయినిలో కలరా వ్యాధి నుంచి ప్రజలను కాపాడలని, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్ (లష్కర్)లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామనీ వేడుకున్నారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. అమ్మవారు కరుణించడం వల్లనే కలరా వ్యాధి తగ్గిందని సురటి అప్పయ్య, ఆయన మిత్రులు విశ్వసించారు. ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్‌కు వచ్చారు. ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబసభ్యులకు ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి పాతబోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో (ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో) కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఉజ్జయిని మహంకాళిగా నామకరణ చేసి పూజలు ప్రారంభించారు.