మీ చావు మీరు చావండి!
మా యుద్ధ విమానాలను అడ్డుకుంటారా.. గుర్తుపెట్టుకుంటాం
ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపాటు
వాషింగ్టన్, మార్చి 31: ఇరాన్‌పై యుద్ధానికి సహకరించని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిప్పులు చెరిగారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో సహాయం చేయమంటే.. చేయరా అని తీవ్ర ఆవేదన వెళ్లగక్కారు. యుద్ధానికి వెళ్తున్న అమెరికా ఫైటర్ జెట్స్‌కు అనుమతి నిరాకరించిన ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ దేశా లపై సీరియస్ అయ్యారు. క్లిష్ట పరిస్థితు ల్లో మీరు వ్యవహరించిన తీరును గుర్తుంచుకుంటామని హెచ్చరించారు.
హార్మూజ్ జలసంధి మూసివేతతో ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న మిత్రదేశాలను.. మీ చావు మీరు చావండన్నట్లుగా మాట్లాడారు. ఇరాన్‌పై యుద్ధంలో తమ కు సహకరించని మిత్రదేశాలకు చమురు ఇచ్చే ప్రసక్తే లేదని.. ‘మీరే ధైర్యం కూడగట్టుకుని హార్మూజ్ జలసంధికి వెళ్లి, మీకు కావాల్సింది తెచ్చుకోండ’ని నిష్టూరమాడారు. మాకు సహయం చేయనప్పుడు మీ కోసం మేం ఎందుకు రిస్క్ చేయాలని అసహనం వ్యక్తం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలను కాపాడుకునేందుకు, రవాణాకు ఆటంకం లేకుండా చూసేందుకు అమెరికా మిత్రదేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని ఇదివరకే ట్రంప్ పిలుపు నిచ్చారు. అయితే, ట్రంప్ పిలుపునకు ఆశించిన స్పందన రాలేదు.
యుద్ధం ఎప్పుడు ముగిస్తారో ముందు ట్రంప్ స్పష్టంగా చెప్పాలని యూరప్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. నాటో దేశాలకు అమెరికా ఇన్నాళ్లూ కొండంత అండగా నిలిచినా, ఇప్పుడు ఇరాన్ అణు ముప్పు ను అడ్డుకోవడంలో వారు వెనకడుగు వేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అండ లేకపోతే నాటో కేవలం ఒక ’కాగితపు పులి’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇలా ఉండగా, హార్ము జ్ జలసంధి తెరవడం తమ ప్రధాన లక్ష్యం కా దని వైట్‌హౌస్ వెల్లడించింది.
హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోకపోయినా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ము గించేందుకు సిద్ధంగా ఉన్న ట్లు ట్రంప్ స న్నిహిత వర్గాలకు తెలిపినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ స ముద్రమార్గాన్ని బలవంతంగా తెరవడానికి ప్ర యత్నించడం క్లిష్టమైనదిగా, యుద్ధాన్ని మరిం త పొడిగించే ప్రమాదం ఉందని అమెరికా అంచనా వేస్తోంది. అందుకే తక్షణ లక్ష్యంగా జలసంధికాకుండా యుద్ధాన్ని త్వరగా ముగించడంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
యుద్ధం ఆపొద్దు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గల్ఫ్ దేశాల విజ్ఞప్తి
వాషింగ్టన్, మార్చి 31: ఇరాన్ ఓడిపోయేవరకు యుద్ధం కొనసాగించాలని, ప్రస్తుత పాలనాయంత్రాంగం పూర్తిగా కూలిపోయే వరకు యుద్ధం ముగించవద్దని గల్ఫ్ దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశాయి. గత నెలరోజులుగా యుద్ధం జరుగుతున్నా ఇరాన్ పెద్దగా బలహీనపడలేదు. నాయకత్వంలో మార్పు రావాలి. సైనిక చర్యను కొనసాగించాలని సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్‌లు ట్రంప్‌ను కోరినట్లు అసోసియేటెడ్ ప్రెస్ ఓ కథనంలో పేర్కొంది.
అదే సమయంలో ఇరాన్‌పై దాడి గురించి అమెరికా ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై, యుద్ధం కారణంగా సంభవించే పరిణామాలను పట్టించుకోకపోవడంపై గల్ఫ్ దేశాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశాయి. టెహ్రాన్‌లోని మతపెద్దల పాలనను పూర్తిగా కూలదోయడానికి ఇదొక చరిత్రాత్మక అవకాశమని కొన్ని దేశాలు అభిప్రాయం వ్యక్తంచేశాయని పేర్కొంది.
ఇరాన్‌పై సైనిక చర్యను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన సన్నిహితుల వద్ద ట్రంప్ వ్యాఖ్యానించారని వాల్ స్ట్రీట్ ఒక కథనంలో పేర్కొంది. దీనికి భిన్నంగా పశ్చిమాసియాలో అమెరికా బలగాల మోహరింపు పెరుగుతుండటం గమనార్హం.




