మహిళలకు నెలకు రూ.3 వేలు
- రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
ఆస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
పాల్గొన్న సీఎం హిమంత బీస్వశర్మ తదితరులు
గౌహతి, మార్చి 31: అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మంగళవారం గౌహతిలో తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ సమక్షంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆవిష్కరించారు.ఈ ప్రణాళిక సురక్షిత అస్సోం, విక్షిత అస్సోం అనే కార్యక్రమం కింద 31 హామీలను ప్రకటించింది ముఖ్యంగా మహిళల కోసం అరుణోదయ్ కింద నెలకు రూ.3 వేలు అందిస్తామని ప్రకటించింది.
అలాగే ప్రభుత్వ భూమి నుంచి అక్రమ ఆక్రమణలను తొలగించడం, వలసదారుల (అస్సాం నుంచి బహిష్కరణ) చట్టం, 1950ని అమలు చేయడం, నిజమైన పౌరులందరికీ భూమి హక్కులను కల్పించడం వంటి అంశాలు ఉన్నాయి. మేనిఫెస్టోలో 6వ షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజన వర్గాలను మినహాయించి ఉమ్మడి పౌర స్మృతి ప్రతిపాదన ఉంది. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 8వ వేతన సంఘం అమలు చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది.
కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచిత విద్యను అందించాలని కూడా ఇది ప్రతిపాదిస్తోంది. రాష్ట్రంలో ఎక్స్‌ప్రెస్‌వేలు, వందే భారత్ రైలు ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టాలని కూడా ఇది ప్రతిపాదిస్తోంది. అలాగే వరదరహిత రాష్ట్రంగా చర్యలు, అరుణోదయ పథకం కింద మహిళలకు నెలకు రూ.3వేలు అందజేయడం, లఖ్‌పతి దీదీ పథకం కింద 40 లక్షల మంది మహిళలకు ప్రోత్సాహాలు కల్పించడం లాంటివి బీజేపీ తన మ్యానిఫేస్టోలో ప్రకటించింది. కాగా 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అస్సాంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.




