12 April, 2026 | 7:29 PM

ప్రభుత్వ భూముల జోలికెళ్తే జైలుకే!

28-06-2024 04:53 AM
  • ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా కార్యాచరణ

సర్కారు ఆస్తుల రక్షణే ధ్యేయంగా ప్రణాళికలు

ఏపీడీఎంగా మార్పు చెందబోతున్న ఈవీడీఎం 

హెచ్‌ఎండీఏ పరిధి వరకూ విస్తరించేలా వ్యూహాలు

రెండు వారాల్లో విడుదల కానున్న మార్గదర్శకాలు 

నేరుగా సీఎం పర్యవేక్షణలో ఏపీడీఎం విభాగం 

కమాండ్ కంట్రోల్ వేదికగా నిఘా నిర్వహణ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27(విజయక్రాంతి): తెలంగాణ పునర్నిర్మాణంపై ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎలాంటి నిర్ణయాలు అవసరమో పదేళ్ల తర్వాత కొలువు దీరిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం అదే తరహా ఆలోచనలతో ముందుకెళ్తోంది. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైద రాబాద్ మహానగరాన్ని నూతనంగా తీర్చిదిద్దేందుకు  ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వానికి చెందిన ఖరీదైన భూములు, విలువైన ఆస్తుల పరిరక్షణ, ప్రకృతి విపత్తుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించింది. వీటిపై ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టార్ మేనేజ్ మెంట్ (ఈవీడీఎం) విభాగం పర్యవేక్షణ కొనసాగేది. అది కూడా గ్రేటర్ పరిధికే పరిమితంగా ఉండేది. అయితే, ఈవీడీఎంను మరింత పటిష్టపరిచేలా మార్పులు తీసుకురాబోతోంది. గ్రేటర్ వరకే కాకుండా మహానగర వ్యాప్తంగా విస్తరించేలా  కార్యాచరణ ను సిద్ధం చేస్తోంది. 

హెచ్‌ఎండీఏ దాకా విస్తరణ

జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఈవీడీఎంను హెచ్‌ఎండీఏ దాకా విస్త రించాలని ప్రభుత్వం భావిస్తోంది. విపత్తుల సమయంలో ఈ విభాగం గ్రేటర్‌లోని 150 డివిజన్లకు మాత్రమే సహాయక చర్యలు అందిస్తోంది.  అయితే, హైదరాబాద్ మహానగరం 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాల్లో ప్రస్తుతం విస్తరించి ఉంది.  ఈ నేపథ్యంలో విపత్తుల సహాయక చర్యలు గ్రేటర్‌కు మాత్రమే పరిమితం కావడంతో హైదరాబాద్‌కు లింక్‌గా నున్న పరిసరాలు నిర్లక్ష్యానికి గురవుతున్నట్టుగా స్థానిక ప్రజలు భావిస్తున్నారు.

ముఖ్యంగా నగరం మరింత విస్తరిస్తున్న కాలక్రమంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి, భూములకు మూడు, నాలుగు రెట్లు విలువ పెరగడంతో అదే స్థాయిలో ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యం లో వాటి పరిరక్షణకు ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో ఈవీడీఎంను అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజిస్టార్ మేనేజ్‌మెంట్ (ఏపిడిఎం)గా మార్చనుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రభుత్వం రెండు వారాల్లో విడుదల చేయనుంది. 

బ్జాలకు పాల్పడితే జైలుకే.. 

హైదరాబాద్ మహానగరం పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాల గురవ్వడం, చెరువులలో ఎఫ్‌టిఎల్‌కు మించి నిర్మాణాలు చేపట్టడం, ఇతర ప్రభు త్వ ఆస్తులలోకి ఆక్రమణదారులు ప్రవేశించడం లాంటి అనేక సంఘటనలు నిత్యం జరగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వ్యాప్తంగా మొత్తం 920 చెవువులు, కుంటలలో 282 పూర్తిగా, మరో 209 చెరువులు పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్టుగా ప్రభు త్వం ఇప్పటికే నిర్థారణకు వచ్చింది. ఇంకా అనేక ప్రభుత్వ ఆస్తులు ఇప్పటికే కబ్జాల పాలయ్యాయి. ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వ భూములను కాపా డటం కోసం అసెట్ ప్రొటెక్షన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం ఈ విభాగాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డే పర్యవేక్షించేలా విధి విధానాలు రూపొందనున్నాయి.

ఐజి స్థాయి అధికారి ఏవి రంగనాథ్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ చేయనున్నారు. హెచ్‌ఎండిఏ పరిధి దాకా విస్తరణ కానున్న ఈ విభాగంలోకి మరో ఇద్దరు ఎస్‌పిలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఇరిగేషన్ శాఖ, జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు తదితరులను కొత్తగా నియామకం కానున్నారు. వీటితో పాటు హెచ్ ఎండిఏ పరిధిలో అధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై కొరడా ఝులిపించ నున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఆక్రమణదారులు భయపడేలా, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా ఉక్కుపాదం మోపనున్నారు. ఈ విభాగాన్ని అత్యంత సమర్థవంతంగా తీర్చిదిద్దనున్నారు.