18 August, 2026 | 2:51 PM

మహిళా సంఘాల ఆర్థిక బలోపేతమే లక్ష్యం

18-08-2026 02:16 PM

జిల్లా కలెక్టర్ హేమంత్

కొల్లాపూర్ రూరల్: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు. మంగళవారం కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి గ్రామ శివారులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 119లో ఉన్న సుమారు 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి, ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలతపై అధికారులతో చర్చించారు.

స్థల స్వరూపం, రహదారి సౌకర్యం, విద్యుత్ ప్రసార అవకాశాలు, అవసరమైన మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయ వనరు లభించే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కూడా సౌర విద్యుత్ వినియోగం దోహదపడుతుందన్నారు. శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి స్థల ఎంపిక, మౌలిక వసతులు, విద్యుత్ ప్రసారానికి సంబంధించిన పూర్తి ప్రతిపాదన రూపొందించాలని సూచించారు. కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, ఎంపీడీవో, ఐకేపీ, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.