రికార్డు స్థాయి నుంచి దిగిన బంగారం, వెండి
హైదరాబాద్, మే 21: ప్రపంచ మార్కెట్లో ఇతర కమోడిటీలతో పాటు బంగారం, వెండి ధరలు సైతం తగ్గడంతో భారత్‌లోనూ ఆ రెండు లోహాల ధరలు కొత్త రికార్డుస్థాయి నుంచి దిగివచ్చాయి. మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్కసారిగా రూ.650 మేర తగ్గి రూ.74,510 వద్ద నిలిచింది. సోమవారం పసిడి రూ.75,160 స్థాయికి చేరి కొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.600 దిగివచ్చి రూ.68,300 స్థాయికి చేరింది. స్వల్పకాలంలో జోరుగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని దీంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,420 డాలర్ల వద్దకు తగ్గినట్టు బులియన్ ట్రేడర్లు తెలిపారు. క్రితం రోజు ఇది 2,440 డాలర్లపైన కొత్త రికార్డును నెలకొల్పింది. పసిడితో పాటు వెండి, రాగి, జింక్ తదితర కమోడిటీల ధరలన్నీ తగ్గాయని చెప్పారు. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సైతం పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర రూ.74,100 స్థాయికి తగ్గింది.
రూ.2000 తగ్గిన వెండి
పసిడి బాటలోనే వెండి కూడా హైదరాబాద్ మార్కెట్లో తగ్గింది. కేజీ వెండి ధర రూ.2,000 తగ్గి రూ.99,000 వద్ద నిలిచింది. సోమవారం ఈ వైట్ మెటల్ ధర రూ.1,01,000 వద్ద రికార్డుస్థాయిని నమోదు చేసింది. ప్రపంచ మార్కెట్లో వెండి ఔన్సు ధర 2 శాతం మేర క్షీణించి 31.50 డాలర్ల వద్దకు చేరింది.






