వన్నె తగ్గిన కృత్రిమ వజ్రాలు
అధిక ఉత్పత్తితో ధరలు క్రాష్
ఎగుమతులు తగ్గినా, దేశంలో పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ, మే 21: ప్రపంచ మార్కెట్లలో అధికోత్పత్తి కారణంగా ల్యాబ్‌లో తయారుచేసే కృత్రిమ వజ్రాల ధరలు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నిలువునా 45 శాతం పతనమయ్యాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ క్యారెట్ల కృత్రిమ వజ్రాలు ల్యాబ్‌ల్లో ఉత్పత్తయ్యాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తికంటే ఇది 33 శాతం అధికం. గ్లోబల్ ఉత్పత్తి పెరిగిన కారణంగా భారత్‌లో ఉత్పత్తయ్యే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ (ఎల్‌జీడీలు) ఎగుమతుల విలువ ఏప్రిల్ నెలలో నిరుడు ఇదేనెలతో పోలిస్తే 18.2 శాతం క్షీణించి 83.77 మిలియన్ డాలర్లకు చేరింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ధరలు 45 శాతం పడిపోయాయని, ఎల్‌జీడీ ధరలు మరింత తగ్గితే, ఎల్‌జీడీ తయారీదారులు తీవ్ర నష్టాల్ని చవిచూడాల్సి వస్తుందని ఎల్‌జీడీ స్టోర్ చైన్ నిర్వహిస్తున్న లైమ్‌లైట్ డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూజా సేఠ్ మాధవన్ చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో పతనమైన ధరల కారణంగా గతంలో వచ్చిన గొప్ప లాభాలన్నీ హరించుకుపోయాయని వాపోయారు. లైమ్‌లైట్‌కు దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 10 ఇండిపెండెంట్ స్టోర్లు, 40 షాప్ ఉన్నాయి. కొత్తగా మరో ఐదు స్టోర్స్‌ను ఏర్పాటుచేయాలని భావిస్తున్నది.
ఎల్‌జీడీ రంగంలోకి సహజ వజ్రాల వ్యాపారులు
సహజంగా లభించే వజ్రాలను విక్రయించే వ్యాపారులు కూడా ఎల్‌జీడీలకు వస్తున్న లాభాల్ని చూసి, ఈ వ్యాపారంలోకి ప్రవేశించారు. అంతేకాకుండా రష్యాలోని వజ్రాల గనులపై జీ7 పెట్టిన ఆంక్షలు సైతం సహజ వజ్రాల వ్యాపారానికి ఆటంకం కల్గించింది. మరోవైపు యూఎస్, చైనాలకు సహజ వజ్రాల ఎగుమతులు తగ్గడంతో దేశీయ వజ్రాల వ్యాపారులు ఎల్‌జీడీ వ్యాపారంలోకి ప్రవేశించి, సూరత్‌లోని వారి యూనిట్లలో కార్మికుల్ని ల్యాబ్ వజ్రాల యూనిట్లలో నియమించుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 6000 ఎల్‌జీడీ రియాక్టర్లు ఉన్నాయని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఎల్‌జీడీ వ్యాపారంపై గోగ్రీన్ డైమండ్స్ వ్యవస్థాపకుడు టోనీ మెహతా స్పందిస్తూ భారత్‌లోనూ, విదేశాల్లోనూ ఎల్‌జీడీలకు పెరుగుతున్న డిమాండ్‌తో తన బిజినెస్ మోడల్‌ను మార్చుకున్నానని, ఇప్పుడు తమ వ్యాపారంలో 85 శాతం వాటా ఎల్‌జీడీలదేనని, మిగిలిన 15 శాతం సహజ వజ్రాలదని చెప్పారు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, తూర్పు దేశాల్లో ఎల్‌జీడీలకు వేగంగా డిమాండ్ పెరిగిందన్నారు. ఆ దేశాలతో పోలిస్తే భారత్‌లో వీటి మార్కెట్ కొత్తగా ఆవిర్భవిస్తున్నదని, అయితే ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతున్నదని వివరించారు. సహజ వజ్రాల కంటే ఎల్‌జీడీలు చౌకగా లభిస్తున్నందున, దేశంలో వీటికి డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు.
ధర ఎంతో చౌక
మంచి నాణ్యతగల సహజ వజ్రం క్యారట్ ధర రూ.4. లక్షలు ఉంటే, అదే నాణ్యతగల ఎల్‌జీడీ క్యారట్ ధర కేవలం రూ. 35,000 ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలో కొత్తగా వజ్రాల గనులేవీ రాకపోవడంతో గనుల నుంచి వెలికితీసే వజ్రాలకు కొరత ఏర్పడుతున్నది. 2023 ప్రధమార్థంలో సహజ వజ్రాల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ, నవంబర్ నుంచి స్థిరపడ్డాయి. రిటైల్ జ్యువెల్లరీలో మార్కెట్ లీడర్ అయిన తనిష్క్ కూడా ఎల్‌జీడీ రంగంపై దృష్టిపెట్టింది. దేశంలో ఈ రంగం ఎలా రూపొందుతున్నదో గమనిస్తున్నామని, ప్రస్తుతానికైతే ఈ రంగంలో ప్రవేశించే ఉద్దేశ్యం తమకు లేదని తనిష్క్ సీఈవో అజోయ్ చావ్లా చెప్పారు.






