మార్కెట్ @ 5 ట్రిలియన్ డాలర్లు
తొలిసారిగా ఈ మ్యాజిక్ ఫిగర్‌కి ఇన్వెస్టర్ల సంపద
ఆరు నెలల్లోనే ట్రిలియన్ డాలర్లు జంప్
ముంబై, మే 21: భారత స్టాక్ మార్కెట్ అరుదైన ఫీట్ సాధించింది. మంగళవారం తొలిసారిగా మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లను (రూ.414.75 లక్షల కోట్లు) చేరింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరుపుతున్నా, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోలుకు మద్దతుతో లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి పక్షం రోజుల ముందే ఈ మ్యాజిక్ ఫిగర్‌ని చేరడం గమనార్హం. కేవలం ఆరు నెలల లోపునే ఇన్వెస్టర్ల సంపద 4 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు ఎగిసింది. ఇంత వేగంగా మార్కెట్ విలువ పెరగడం ఇదే ప్రధమం. ఇప్పుడు ప్రపంచంలో ఐదవ పెద్ద స్టాక్ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించింది. మార్కెట్ ర్యాకింగ్స్‌లో యూఎస్ అగ్రస్థానంలో ఉండగా, చైనా, జపాన్, హాంకాంగ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత మార్కెట్‌విలువ 2023 నవంబర్ 29న తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్లను చేరింది. అక్కడ్నుంచి ఆరు నెలలు నిండకుండానే 2024 మే 21న 5 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను తాకింది. ఈ మధ్యకాలంలో జరిగిన ర్యాలీలో దేశీ ఫండ్స్, రిటైల్, హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నారు. భారత మార్కెట్ తొలిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల విలువను 2007లో అందుకున్నది. అటుతర్వాత మరో ట్రిలియన్ డాలర్ల విలువ పెరగడానికి పదేండ్ల సమయం పట్టింది. 2017లో ఈ విలువను సాధించింది. అటునుంచి నాలుగేండ్ల తర్వాత 3 ట్రిలియన్ డాలర్లను చేరింది.
2030కల్లా 10 ట్రిలియన్ డాలర్లకు
వచ్చే మూడేండ్లకు 2027కల్లా భారత్ ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా వృద్ధిచెందుతుందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. గత 15 ఏండ్ల మార్కెట్ రాబడుల ప్రకారం లెక్కించి, కొత్త లిస్టింగ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే 2030కల్లా భారత స్టాక్ మార్కెట్ విలువ 10 ట్రిలియన్ డాలర్లను చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2027కల్లా భారత జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని, జపాన్, జర్మనీలను దాటి మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ జెఫ్ఫెరీస్ ఒక తాజా నోట్‌లో వివరించింది. ప్రస్తుత బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ పెరగడంతో పాటు ఐపీవోలు, ఎఫ్‌పీవోలు, ఓఎఫ్‌ఎస్‌లు తదితర రూపాల్లో మార్కెట్ సంపద వృద్ధిచెందుతుందని జెఫ్ఫెరీస్ అనలిస్టులు వివరించారు. ఇండియాలో ఉన్న యూనీకార్న్‌లు వచ్చే 5 ఏండ్లలో మెచ్యూర్ అవుతాయని, వాటి విలువ 100 బిలియన్ డాలర్ల నుంచి 350 బిలియన్ డాలర్లకు చేరుతుందని, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, ఓలా ఎలక్ట్రిక్, ఫోన్‌పే వంటివి వచ్చే కొద్ది ఏండ్లలో స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టవుతాయని, వీటితో పాటు రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ లిస్టింగ్స్ సైతం మొత్తం మార్కెట్ విలువను పెంచుతాయని వారు చెప్పారు.
టాప్‌లో టాటా స్టీల్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా స్టీల్ 3.8 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి రూ.174 వద్ద ముగిసింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 1 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు నెస్లే, మారుతి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్, లార్సన్ అండ్ టూబ్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు 2 శాతం వరకూ నష్టపోయాయి.






