నేడు భారీగా తగ్గనున్న బంగారం?
- ప్రపంచ మార్కెట్లో 65 డాలర్లకుపైగా తగ్గిన పసిడి
- దేశీయ ఎంసీఎక్స్‌లో రూ.1,700 పతనం
- యూఎస్ జాబ్స్ డేటా ఎఫెక్ట్
హైదరాబాద్, జూన్ 7: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర శుక్రవారం రాత్రి అనూహ్యంగా పతనమయ్యింది. కడపటి సమాచారం అందేసరికి ఔన్సు పుత్తడి ధర ఒక్కసారిగా 65 డాలర్లకుపైగా పతనమై 2,310 డాలర్లస్థాయికి పడిపోయింది. యూఎస్ ఆర్థిక వ్యవస్థ బలాన్ని సూచిస్తూ అక్కడ జాబ్స్ డేటా వెలువడటంతో సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలే ఈ పతనానికి కారణం. ఈ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల పసిడి రూ.1,700 మేర తగ్గి రూ.71,430 స్థాయికి క్షీణించింది. సాయంత్రం సమయానికే ముగిసే హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.73,750 వద్దకు చేరింది. 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.300 అధికమై రూ.67,600 స్థాయికి ఎగిసింది. కానీ ప్రపంచ మార్కెట్లో ట్రెండ్ కొనసాగితే శనివారం స్థానికంగా ధర రూ. 1,500 వరకూ తగ్గవచ్చని బులియన్ ట్రేడర్లు చెప్పారు.
వెండిదీ ఇదే బాట
ప్రపంచ మార్కెట్లో పుత్తడి బాటనే వెండి అనుసరించింది. ఈ లోహం ఔన్సు ధర 4 శాతంపైగా క్షీణించి 29 డాలర్ల సమీపానికి చేరింది. ఈ ప్రభావంతో దేశీయ ఎంసీఎక్స్‌లో కేజీ వెండి ధర రూ. 4,500 వరకూ పడిపోయింది.






