25 June, 2026 | 9:11 AM

కోలుకున్న రూపాయి

08-06-2024 12:05 AM

13 పైసలు పెరిగిన విలువ

ముంబై, జూన్ 7: వరుస పతనాల్ని చవిచూస్తున్న రూపాయి శుక్రవారం స్వల్పంగా కోలుకున్నది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 13 పైసలు పుంజుకుని 83.40 వద్ద ముగిసింది. జూన్ 4న ఇది 40 పైసల మేర పతనమైన సంగతి తెలిసిందే. ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ జరపడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు జరపడంతో రూపాయి విలువ కొంతమేర కోలుకున్నదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్డడం, జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని పెంచడం కూడా రూపాయిపై సానుకూల ప్రభావం చూపిందన్నారు. ఎన్‌డీఏ 3.0 ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తుందన్న విశ్వాసం ఏర్పడటంతో స్టాక్ మార్కెట్ ర్యాలీ జరుపుతున్నదని, దీనితో సహజంగానే రూపాయి కోలుకున్నదని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్, కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. వచ్చే కొద్ది రోజుల్లో రూపాయి 83 శ్రేణిలో కదలవచ్చని అంచనా వేశారు.