calender_icon.png 18 September, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్‌మాల్ గోల్డ్

18-09-2025 01:33:20 AM

ప్రముఖ వ్యాపార సంస్థ క్యాప్స్‌గోల్డ్‌పై ఐటీ రైడ్స్

  1.   4 రాష్ట్రాల్లోని బ్రాంచిల్లో ఏకకాలంలో దాడులు
  2. వాసవీ గ్రూప్, కళాశ జ్యూవెలరీ సంస్థల్లోనూ తనిఖీలు 
  3. ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి పెద్దమొత్తంలో బంగారం కొన్న క్యాప్స్‌గోల్డ్ 
  4. అమ్మకాలకు, పన్ను చెల్లింపులకు భారీ వ్యత్యాసం! 
  5. క్యాప్స్‌గోల్డ్ అధినేత చందా కుటుంబ సభ్యుల ఇండ్లు, కార్యాలయాల్లో విస్తృత సోదాలు 
  6. సంస్థ డైరెక్టర్ అభిషేక్ అరెస్ట్ 
  7. కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రముఖ బంగారం వ్యాపార సంస్థ క్యాప్స్‌గోల్డ్ లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ బుధవారం మెరుపు దాడులు చేపట్టింది. వందల కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిందన్న పక్కా సమాచారంతో ఐటీ అధికారులు ఏకకాలంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని సంస్థ ప్రధాన కార్యాలయాలతో యజమానుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. క్యాప్స్‌గోల్డ్‌తో పాటు వాసవీ గ్రూప్, కళాశ జ్యూవెలరీ సంస్థల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వ ఖనిజాభి వృద్ధి సంస్థ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి క్యాప్స్‌గోల్డ్ సంస్థ టన్నుల కొద్ది బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే, ఆ తర్వాత జరిగిన రిటైల్, హోల్‌సేల్ అమ్మకాలకు, ప్రభుత్వానికి చెల్లించిన పన్నులకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు ఐటీ ప్రాథమికంగా గుర్తించింది. జీఎస్టీ, ఆదాయపు పన్నులను పెద్ద మొత్తంలో ఎగవేసి, లావాదేవీలను తక్కువ చేసి చూపించారన్నది ప్రధాన ఆరోపణ.

ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు రంగంలోకి దిగి, బంగా రం కొనుగోళ్ల నుంచి అమ్మకాల వరకు జరిగిన పూర్తి ఆర్థిక లావాదేవీల గొలుసును ఛేదించే పనిలో పడ్డారు. ఈ ఆపరేషన్ కోసం ఐటీ శాఖ దాదాపు 15 బృందాలను ఏర్పడి సోదాలు కొనసాగిస్తున్నారు. క్యాప్స్‌గోల్డ్ అధినేత చందా శ్రీనివాసరావు, ఆయన కుటుంబ సభ్యులైన చందా అభిషేక్, చందా సుధీర్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి.

క్యాప్స్‌గోల్డ్, వాసవీ గ్రూప్‌నకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న అభిషేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్‌లోని వీరి నివాసాలు, కార్యాలయాలతో పాటు సికింద్రాబా ద్‌లోని మరో ప్రముఖ బంగారం వ్యాపారి జగదీశ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని కాలాసిగూడ, మహంకాళి వీధిలోని క్యాప్స్‌గోల్డ్ ప్రధాన కార్యాలయాల్లో పలు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఫైల్‌ను, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

లాభాలు ఎటు మళ్లాయి..?

క్యాప్స్‌గోల్డ్, కేవలం బంగారం అమ్మకాలే కాకుండా, ఇతర నగల వ్యాపారులకూ ముడి బంగారాన్ని సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో జరిగిన అనేక లావాదేవీలు లెక్కల్లో చూపలేదని అధికారులు అనుమానిస్తున్నారు. పన్ను ఎగవేత ద్వారా వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్ వంటి ఇతర వ్యాపారాల్లోకి మళ్లించారా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది.

సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు పూర్తయితే బంగారం వ్యాపారంలో జరిగిన అతిపెద్ద పన్ను ఎగవేత కుంభకోణం బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.