ఘనంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు
నాగోల్/జూబ్లీహిల్స్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని పలు చర్చిలలో సిలువ మేస్తున్న యేసుక్రీస్టు ప్రదర్శనను నిర్వహించారు. నాగోల్‌లోని సాయిరాం గార్డెన్‌లో ప్రేయర్ పవర్ చర్చి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవాళి కోసం చేసిన త్యాగం శాశ్వతంగా స్మరణీయమని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అవసరమైన వారికి బట్టలు, బ్యాగులను పంపిణీ చేసి తన సహృదయాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరి, బీఆర్‌ఎస్ నాయకులు ముఠా జయసింహతో పాటు అనేక మంది క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని యూసుఫ్‌గూడ యాదగిరి నగర్లోని జే.ఎల్.ఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ ప్రార్థనల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు సువర్ణ రాజు, జాన్ డేవిడ్, స్వర్ణలత ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




