calender_icon.png 8 June, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోరాశాస్త్రి సామర్థ్యం

11-01-2025 12:00:00 AM

అవి నేను ఎంఏ చదువుతున్న రోజులు. ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాను. నాకు అప్పట్నుంచే ఆయా పత్రికలకు ప్రచురణార్థం వ్యాసాలు పంపడం అలవాటుంది. ఒకరోజు కాళిదాసు కవిత్వం మీద ఒక సమగ్ర వ్యాసం రాశాను. దానిని మా ఇంట్లో టేబుల్‌మీద పెట్టాను. తర్వాత ఆ విషయమే దాదాపుగా మరిచిపోయాను. నేను బాగా అభిమానించే మిత్రుడు, ఒకప్పటి నా క్లాస్‌మేట్ ఒకాయన మా ఇంటికి వచ్చాడు.

అదీ నేను లేని వేళ. నిజానికి అందరి దృష్టిలో మేమిద్దరం ఎంతో ‘మంచి స్నేహితులం’ అనే ముద్రకూడా ఉంది. అతను క్రమంగా మా కుటుంబానికి కూడా సన్నిహితుడయ్యాడు. ఎప్పుడు వచ్చినా పనై పోయిన వెంటనే వెళ్లిపోయే స్వభావం అతనిదెంత మాత్రం కాదు. నేను ఏం చదువుతున్నాను, ఏమేం రాస్తున్నానో పనికట్టుకొని తెలుసుకొనేవాడు. మంచి స్నేహితుడు కావడం వల్ల నేనూ అతనికి తెలియని విషయాలు చెప్పేవాణ్ణి. 

ఆ మిత్రుని దృష్టి మా ఇంట్లోని టేబుల్ మీదున్న నా ‘కాళిదాసు వ్యాసం’ మీద పడింది. నేను లేని ఆ రోజు అతను చాలాసేపు కూర్చున్నాడని మా ఆవిడ తర్వాత చెప్పింది. “ఏదో రాసుకుంటూ ఉంటే నేనేమీ మాట్లాడలేదండి..” అనికూడా శ్రీమతి అంది. అయితే, అతను ఆ రోజు ఊరికే కూర్చోలేదని, కాళిదాసు కవిత్వం మీద నేను రాసిన ఆ వ్యాసాన్ని కాపీ చేశాడని తర్వాత నా దృష్టికి వచ్చింది.

ఈ ఉదంతం వల్ల నాకు రెండు విషయాలు అర్థమయ్యాయి. ఒకటి: మన మిత్రుల్లోనూ ఇలాంటి వాళ్లు ఉంటారని. రెం డవది: పత్రికల్లో సంపాదకులు అత్యంత సమర్థులని. మరీ ముఖ్యంగా ఆనాటి ‘ఆంధ్రభూమి’ దినపత్రిక ఎడిటర్ గోరాశాస్త్రి సామర్థ్యం ఈ సందర్భంగా నాకు ప్రత్యక్షంగా తెలిసివచ్చింది. 

అసలుకు, నకలుకు మధ్య..

అతను ఆ మర్నాడే సికింద్రాబాదులోని పత్రిక కార్యాలయంలో ‘సాహితి’ పేజీ నిర్వాహకులకు తాను మా ఇంట్లోంచి కాపీ చేసి తెచ్చిన వ్యాసం ప్రచురణకోసం ఇచ్చాడు. ఈ సంగతీ నాకు తెలియదు. కాని, రెండు రోజుల తర్వాత నా వ్యాసాన్ని శుద్ధప్రతిగా మార్చుకొని, స్వయంగా పత్రిక కార్యాలయానికి వెళ్లి ఇచ్చాను. అప్పుడు ఆ పత్రిక సంపాదకులు గోరాశాస్త్రి. అప్పటికి నాకు ఆయన బాగా పరిచయం.

నేను ఇచ్చిన వ్యాసాన్ని చూసిన ఆయన వెంటనే ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. కానీ, అప్పుడు అదేమీ వ్యక్తపరచుకుండా, “నేను చూస్తాను లెండి” అని వారు తమ పనిలో లీనమయ్యారు. ఆయన ఆశ్చర్యానికి కారణం వెంటనే నాకు తెలియలేదు. అంతేకాదు, వారి సామర్థ్యం కూడా అప్పటికి నాకు తెలిసింది కాదు. ఆ తర్వాత కానీ, బోధ పడలేదు.

ఒక వారం తర్వాత నేను కాళిదాసు కవిత్వం మీద రాసిన వ్యాసం ‘ఆంధ్రభూమి’లో అచ్చయింది. నాకు ఎంతో సం తోషం కలిగింది. అచ్చు వేసినందుకు సం పాదకులకు కృతజ్ఞతలు చెప్పాలని స్వ యంగా పత్రికా కార్యాలయానికి వెళ్లాను. నిజానికి నేను అప్పుడు సికింద్రాబాదులోని ఇస్లామియా హైస్కూల్‌లో తెలుగు పండితునిగా పని చేస్తున్నాను. కనుక, ఆ పత్రికాఫీసుకు తరచూ వెళ్లేవాణ్ణి. నేను కార్యాలయంలో అడుగు పెట్టగానే, గోరాశాస్త్రి చిరునవ్వుతోనే నేను కుర్చీలో కూర్చునేలా చేశారు.

‘నా మిత్రుడు తెచ్చిన వ్యాసం కాపీ కొట్టిందని’ నా వ్యాసం చూసిన తర్వాత ఆయనకు తెలిసిందట. వ్యాసం ఎలాంటిదో కాదు, వ్యాసం రాసిన వారి ప్రతిభ ఎలాంటిదో కూడా పసిగట్టగలిగిన సంపాదకులు ఉంటారని నాకు ఆనాడే తెలిసింది.

వ్యాసం అచ్చయిన తర్వాత ఆ ప్రియమిత్రుడు చాలారోజుల దాకా నాకు కనిపించలేదు. నేనుకూడా ‘ఎందుకు కనిపించడం లేదని’ పని కట్టుకొని అడగలేదు. ఆ విషయమేనాడూ తన వద్ద ప్రస్తావించనూ లేదు. కాకపోతే, మన మిత్రులలో మనకు తెలియకుండా ఇలాంటి వారుకూడా ఉంటారని నాకప్పటికి అర్థమైంది.

 ఆచార్య మసన చెన్నప్ప వ్యాసకర్త సెల్: 9885654381