పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఎస్పీ నితిక పంత్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, లాకప్ రూమ్, రిసెప్షన్, బెల్ ఆఫ్ ఆర్మ్స్ రూమ్, స్టోర్ రూమ్, స్టేషన్ హాజరు రిజిస్టర్, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ శుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ సందీప్ కుమార్‌తో పాటు స్టేషన్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో చట్టవ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, మహిళలు,బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా రాత్రి వేళల్లో పికెటింగ్, ప్యాట్రోలింగ్, పర్యవేక్షణను కట్టుదిట్టంగా కొనసాగించాలని తెలిపారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్ పాల్గొన్నారు.






