పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా
ధాన్యం కొనుగోలులో పారదర్శకత
పదేళ్లలో ఒక పెన్షన్ ఇవ్వని ఘనత గత ప్రభుత్వానిదే..
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర
మిర్యాలగూడ, నకిరేకల్‌లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు
రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
నల్లగొండ, మే 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తోందని అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తూ వారికి భరోసా ఇస్తోందని రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆఫీస్ లో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు పేమెంట్లు సకాలంలో జమ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తూ వాటి తరలింపుకు ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. అలాగే వాటికి సంబంధించిన నగదును సైతం వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామన్నారు. గత పదేళ్లలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వని ఘనత గత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 2 నుంచి 2 లక్షల నూతన పెన్షన్లను ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి టామ్ కామ్ సంస్థ ఏర్పాటుకు రూ. 90 కోట్లను కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా పాలన చేస్తున్నామన్నరు. యువతకు టామ్ కామ్ సంస్థ ద్వారా జర్మనీ లాంగ్వేజ్ ని నేర్పించి ఉపాధి కల్పించేందుకు ఫ్యాకల్టీని నియమిస్తున్నట్లు తెలిపారు.
పరిశ్రమలో కార్మికుల రక్షణకు, ప్రత్యేకంగా ఫార్మా రంగాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతకు ముందు పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోడి రెక్క శౌరి మృతి చెందగా పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశంతో కలిసి శౌరి పాడెను మోశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






