అమెరికాలో రోడ్డు ప్రమాదం
నల్లగొండ జిల్లా యువతి దుర్మరణం
నల్లగొండ/చిట్యాల, మే 17 (విజయక్రాంతి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి కూతురు గడుసు నవ్య (25) దుర్మరణం పాలైంది. ఉన్నత చదువుల కోసం నవ్య రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగోకు వెళ్లి, అక్కడ ఎమ్మెస్ పూర్తి చేసి ప్రస్తుతం పార్ట్ టైం జాబ్ చేస్తున్నది. ఈ క్రమంలో విధులు ముగించుకొని తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా.. వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ వాహనం ఢీకొనడంతో నవ్య అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంతాపం తెలిపారు. నవ్య భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా ఆమె స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో కోమటిరెడ్డి మాట్లాడారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రవాస భారతీయులు, తెలుగు అసోసియేషన్ల సహాయంతో అవసరమైన అన్ని పత్రాలు, ఫార్మాలిటీస్‌దీతిజిజిను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.






