7 April, 2026 | 4:20 AM

గిరిజన విద్యార్థుల విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

07-12-2024 11:25 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్...

మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన 

మణుగూరు: గిరిజన విద్యార్థుల విద్యాభ్యాసం అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని కృష్ణ సాగర్ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కొరకు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి వరకు చదివి పై చదువులు చదవడానికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కొరకు అనేక వసతి సౌకర్యాలతో మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం త్వరలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

గిరిజన విద్యార్థులు పదో తరగతి వరకు చదివి ఇంటర్ చదవకుండా పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి సరియైన పాలిటెక్నిక్ జిల్లాలో లేనందున పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కృషి వలన ఇక్కడ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు అయిందని, కానీ ప్రస్తుతం ఈ కళాశాల మణుగూరులో నడుస్తుందని, ఇక్కడ కళాశాల నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వ భూమి 10 ఎకరాల అవసరం ఉన్నందున రెవెన్యూ వారితో సర్వే చేయించగా 10 ఎకరాల స్థలం ఒక దగ్గర దొరకలేదని అందువలన కళాశాల నిర్మాణానికి జాప్యం జరిగిందని, ప్రస్తుతం గురుకులం కళాశాల దగ్గర ఉన్న సిబ్బంది నివాసగృహాలు పురాతనమై కూలిపోయే స్థితిలో ఉన్నందున వాటిని పూర్తిస్థాయిలో కూలగొట్టి సిబ్బంది క్వార్టర్స్ ను వేరే దగ్గర నిర్మాణం చేపట్టి ఇక్కడ ఉన్న పది ఎకరాల ప్రభుత్వ భూమిలో అన్ని రకాల సౌకర్యాలతో రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పనులు అతి త్వరలో చేపట్టి నిర్మాణం పూర్తి కాగానే మణుగూరులో ఉన్న కళాశాలను ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

అనంతరం గురుకుల కళాశాల విద్యార్థులతో మాట్లాడుతూ.. కళాశాలలో మెనూ ప్రకారం పౌష్టికారమైన ఆహారము అందుతున్నది లేనిది తెలుసుకున్నారు. విద్యార్థులు క్రీడల పట్ల ఎక్కువగా మక్కువ చూపుతున్నందున విద్యార్థుల యొక్క ఆట తీరును గమనించి అన్ని రకాల క్రీడలకు సంబంధించిన క్రీడా పరికరాలను అందజేస్తానని, విద్యార్థులు ఇష్టమైన క్రీడలలో పాల్గొని రాష్ట్రస్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొని పథకాలు సాధించి కళాశాలకు, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, కళాశాల ప్రిన్సిపాల్ దేవదాస్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నాగ ముని నాయక్, పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.