అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమి
- అధికారుల నిర్లక్ష్యమే కారణం: సీఐటీయూ శ్రీనివాస్
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: తారా సింగ్
తాండూరు, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని సంబంధిత అధికారులు తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ భూమి కబ్జాల పాలవుతుందని జిల్లా సిఐటియు కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు. పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 123లో ఉన్న అర ఎకరం భూమిని అక్రమార్కులు కొందరు ఆక్రమణలు చేసి నిర్మాణాలు కూడా చేపడుతున్నారని పేర్కొన్నారు.
పట్టా భూమికి ఆనుకుని ఉన్న ఈ ప్రభుత్వ భూమిపై కన్నుబడిన బడా వ్యాపారి ఏకంగా సెల్లార్ నిర్మాణం చేపడుతూ ప్రభుత్వం భూమిలో సైతం నిర్మాణాలు జరుపుతున్నాడని అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. ఈ విషయమై తాండూర్ తాసిల్దార్ తారా సింగ్ ను వివరణ కోరగా సర్వేనెంబర్ 123 ప్రభుత్వ భూమేనని విచారణ, సర్వే చేసి అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.




