5 July, 2026 | 1:50 AM

చెరువులా మారిన ప్రభుత్వ బడి

05-07-2026 12:36 AM

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, టీచర్లు

చేగుంట, జూలై 4: చిన్న పాటి వర్షంతో మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో ఉన్న పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాల చెరువుగా మారింది. శనివారం రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి పాఠశాల ఆవరణ నీటితో నిండింది. ఆవరణలో నీరు చేరడం వల్ల విద్యార్థులు, టీచర్లు తరగతి గదిలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో  కూడా భారీ వర్షాలకు మండలంలో అనేక స్కూళ్లు జలమయమైన సంఘటనలు ఉన్నాయి. గతంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా అప్పటి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాఠశాలకు సెలవులు ప్రకటించారు. 

గత సంవత్సరం నుండి ఇప్పటివరకు, స్పందించకపోవడం విచారకరం. ఈ వర్షం నీటి పక్కనే విద్యార్థులు మధ్యాహ్న  భోజనాన్ని ఆరగిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్న నీరజ మండల విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఆమె పనిచేస్తున్నటువంటి పాఠశాలలో ఇలాంటి దుస్థితి ఉంటే, మండలంలో ఉన్న వెరే పాఠశాలల పరిస్థితి ఏంటో అని ప్రజలు అంటున్నారు. కాగా వర్షం నీటి పైన పట్టణ సర్పంచ్ స్రవంతి సతీష్‌కు తెలియజేశామని, ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోయాయని మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజ వెల్లడించారు. పాఠశాలలో ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో ఇలాంటి సమస్యలను ఉత్పన్నం అవుతున్నాయని, త్వరలోనే  ఇట్టి సమస్య పరిష్కరిస్తామని అన్నారు.