17 June, 2026 | 3:47 AM

అసంపూర్తి బడుల్లో చదువు..?

17-06-2026 02:51 AM

కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలలు

నూతన విద్యా సంవత్సరం మొదలైనా మౌలిక వసతులు కరువు

అసౌకర్యాల మధ్యన విద్యార్థుల చదువులు

కామారెడ్డి/గాంధారి, జూన్ 15 (విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరి అధ్వానంగా ఉన్నాయి. పాఠశాలలు పునర్ ప్రారంభమైన తరగతి గదులు శిథిలావస్థలో ఉన్న పాఠశాలలతో పాటు, ఫర్నిచర్ కొరత వెక్కిరిస్తుంది. మరికొన్ని పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమాలు కింద నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలు అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నాయి.

వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ప్రభుత్వ పాఠశాల భవనాలను అసంపూర్తి తో వదిలీ వేశారు. దీంతో విద్యార్థుల చదువులు చెట్ల కింద కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతి విద్య సంవత్సరంలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులను కూడా కల్పించలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రావడానికి జంకుతున్నారు. బడిబాట, బడి ఈడు పిల్లలను బడుల్లో చేర్పించడం వంటి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం, ఉదయం అల్పాహారం పథకం ప్రవేశపెట్టింది.

పేద విద్యార్థులకు సౌకర్యవంతమైన విద్యను అందించాల్సి ఉండగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామంటూ గొప్పలు చెప్తున్నా ఆచరణలో మాత్రం కనీస వసతులు కూడా కల్పించడం లేదు. కామారెడ్డి జిల్లా లోని గాంధారి, లింగంపేట్, తాడ్వాయి, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం, పెద్ద పెద్ద కోడప్పగల్, నసురుల్లాబాద్, తదితర మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పలు పాఠశాలల్లో తరగతి గదుల కొరత వేధిస్తుంది.

గాంధారి మండల  కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.90లక్షల నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టగా నిధుల కొరతతో గదుల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది.. దీంతో విద్యార్థులకు విద్యాబోధనకు ఇబ్బంది కరంగా మారింది.. మండలంలోని బూర్గుల్, నేరల్ తండా గ్రామాల్లో కూడా ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

ప్రభుత్వం ఇకనైనా స్పందించి అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేసి విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగి సామాన్యుడికి చదువు అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అదనపు తరగతి గదుల నిర్మాణాలు పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని మండల ప్రజలు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

సంబంధిత కాంట్రాక్టర్ శంకర్ నాయక్ ను విజయక్రాంతి సంప్రదించగా..

రూ.90లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించగా బేస్మెంట్ లెవెల్ వరకు మాత్రమే బడ్జెట్ విడుదల అయ్యిందని  పనులు మాత్రం గోడలు , స్లాబ్ వరకు పూర్తి చేశామని ఇంకా నిధులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిపి వేశామని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఈ ఒక్క పాఠశాలల్లో అనుకుంటే పొరపాటే, జిల్లాలోని 80 పాఠశాలలో అసంపూర్తి భవనాలు ఉన్నాయి. బిల్లులు రాక సగం వరకే నిర్మించి కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. కనీసం మౌలిక వసతులు మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.