పరిశీలనలో ప్రభుత్వ పాఠశాలలు
- అకాడమిక్ ప్యానెల్ ఇన్‌స్పెక్షన్‌పై శ్రద్ధ
- భద్రాద్రి జిల్లాలో 10 ప్రత్యేక బృందాలు
- బృందాల పనితీరుపై ప్రత్యేక నిఘా
- మూడు నెలలలో 100 బడులు పరిశీలించాల్సిందే
- ప్రగతి నివేదికలు పంతుల్ల ఉరుకులు పరుగులు
సుజాతనగర్ ఆగస్టు 25 ( విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాలల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు విద్యార్థుల సామర్థ్యాలను పెంపు చేస్తూ మరోవైపు పాఠశాలను బలోపేతం చేసేందుకు సరికొత్త ప్రణాళికను రూపొందించింది. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా ఎన్నిక కాబడిన ప్రత్యేక ఉపాధ్యాయులు ఇటీవల హైదరాబాదులో జరిగిన ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణను పూర్తి చేసుకొని అందుకు అనుగుణంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు నేరుగా ఆయా ఎంపిక చేసిన పాఠశాలలను ప్రత్యేకంగా పరిశీలన చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది.
ఇందుకుగాను సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్( ఏ. పి. ఐ) చేపట్టనుంది. ఈ ప్యానల్ ఇన్స్పెక్షన్కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల స్థాయిలో 8 బృందాలు ప్రాథమిక ఉన్నత స్థాయి పాఠశాలలకు రెండు బృందాలు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇదిలా ఉండగా ప్రభుత్వ ప్రాథమిక స్థాయి పాఠశాలల పరిశీలన కోసం సంబంధించిన ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం ను నియమిస్తూ మరో ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించింది.
మూడు నెలలు 100 బడులను పరిశీలించాల్సిందే
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి చేపట్టే అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్కు జిల్లా వ్యాప్తంగా 8 బృందాలు పర్యటించనున్నాయి అయితే ఈ బృందాలు ఒక్కో బృందము మూడు నెలల వ్యవధిలో సుమారు 100 పాఠశాలలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
భద్రాద్రి జిల్లా వారీగా ప్రభుత్వ బడులు ఇవే..
తరగతులను బట్టి విద్యార్థులు దాగిన సృజనాత్మకతను వెలికితీస్తూ సామర్థ్యాలను పెంపు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన సరికొత్త కార్యక్రమానికి శిక్షణ బృందాలు సిద్ధ మవుతున్నాయి భద్రాద్రి జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1084, ప్రాథమిక ఉన్నత పాఠశాల 245 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 312 చొప్పున ఉన్నాయి.. వీటిలో పిఎస్ స్థాయి విద్యార్థులు 66808, యుపిఎస్ స్థాయిలో 44281, హైస్కూల్ స్థాయిలో 29,671 దీన్ని బట్టి చూస్తే భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 1641, మొత్తం విద్యార్థుల సంఖ్య 1, 40,760 చొప్పున విద్యను అభ్యసిస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త.. బృందాలు పరిశీలించాల్సిన అంశాలు ఇవే..
ప్రభుత్వ పాఠశాలలు తక్కువేమీ కాదని కార్పొరేట్ స్థాయిలో అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందుకు అనుగుణంగా చేపట్టే సరికొత్త కార్యక్రమాలు ఉపాధ్యాయుల్లో కొంత అలజడి నెలకొంది. పాఠశాలలను పరిశీలనకు వచ్చే బృందాలకు సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు అనేక రకాలైన రికార్డులను సిద్ధంగా ఉంచుకొని నివేదికను అందించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది.
బృందాల పరిశీలనలో ఆయా పాఠశాలలకు సంబంధించిన అభ్యసన సామర్ధ్యాలు గ్రూప్ల వారిగా పిల్లల ప్రగతి ప్రణాళిక ప్రకారం పాఠాలు, ఆయా రికార్డుల పరిశీలన, సులభతర బోధన, గ్రంథాలయం నిర్వహణ, టిఎల్‌ఎం వాడుక, పాఠశాలల సామర్థ్యాలని పెంపొందించే ప్రణాళికలు, బహుళ తరగతి బోధన ఏర్పాటు, ఫౌండేషన్ లిట్రసి న్యూమరసి, విద్యార్థులకు చదవడం రాయడం లెక్కించడం ,తదితర అంశాలను పరిశీలించనున్నారు.
అయితే బృందాల పరిశీలనలో పాఠశాలలో చదివే విద్యార్థుల ప్రగతిని బట్టి గ్రేడ్ నిర్వహించి సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు అంద జేయనున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంతకాలం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులకు పరిశీలనకు వచ్చే బృందాలకు పెన్ను సవాల్ గా మారనున్నాయి.






