విద్యారంగ బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): విద్యారంగాన్ని బలోపేతం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు తరగతి గదులు, భోజనశాల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ సింగ్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, ప్రహరీ గోడ ఇతర సౌకర్యాలను కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య బోధనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఈ క్రమంలో పాఠశాలలో చేపట్టిన అదనపు తరగతి గదులు, భోజనశాల నిర్మాణ పనులు, అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయన 8వ తరగతి విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలన్నారు. మండల కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువల వ్యవస్థ, నివాస ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
రహదారులు, మురుగు కాలువలలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచాలన్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఆ దిశగా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం లంబడితండ (కె) గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు.
గ్రామంలోని పల్లె దవాఖానను సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, పారిశుద్ధ్య నిర్వహణ, రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనన్నారు. పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామంలో ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు.




