calender_icon.png 18 November, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర వైద్యం కోసం ప్రభుత్వం పెద్దపీట

18-11-2025 12:29:13 AM

మెదక్లో రూ.180 కోట్లతో వైద్య కళాశాలకు శంకుస్థాపన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

మెదక్ టౌన్, నవంబర్ 17 : సమగ్రమైన వైద్య సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే మెదక్లో ప్రభుత్వ వైద్య కళాశాల భవనానికి పునాది వేసుకోవడం గొప్ప మైలురాయి అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు తెలిపారు. మెదక్ పట్టణంలోని పిల్లికొట్యాల శివారులో రూ.180 కోట్ల వ్యవయంతో ప్రభుత్వ వైద్య కళాశాలకు 20 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో కళాశాల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే రోహిత్ రావు శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యరంగ అభివృద్ధికి ఇది ఓ చిరస్మరణీయ ఘట్టమని, జిల్లా విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి రావడం, వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు, విద్యార్ధులకు సహాయపడుతుందని తెలిపారు. నూతన వైద్య కళాశాలతో జిల్లా అభివృద్ధి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నూతనంగా నిర్మించనున్న వైద్య కళాశాల భవనాలు, అనుబంధ హాస్పిటల్ ఆధునాతన వైద్య సదుపాయాలతో నిర్మాణాలు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నితిన్ కాబ్రా, సూపర్డెంట్ సునీత, డి సి హెచ్ ఎస్ శివ దయాల్, ఎంసీఏ హెచ్ ఓ డి రాజశ్రీ, వివిధ,ప్రొఫెసర్లు, ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య శాఖా అధికారులు పాల్గొన్నారు.

రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేత...

పాపన్నపేట మండలం పరిధిలోని యూసుఫ్పేట్ గ్రామానికి చెందిన మాస్కారి లక్ష్మయ్య అనారోగ్య సమస్యతో బాధపడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్‌ఓసి నుంచి రూ.2,50,000 ఎల్‌ఓసి కాపీనీ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ప్రత్యేక చొరతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం కుటుంబ సభ్యులకు అందజేశారు.